నివేదిక పేల్చిన బాంబు.. అమెరికాలో భారతీయులంతా ధనికులేనా?

అమెరికాలో ఉన్న భారతీయుల్లో అతి తక్కువ మంది మాత్రమే ఎలాంటి లోటు లేకుండా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారట.

Update: 2024-04-03 11:30 GMT

ప్రపంచ దేశాల పెద్దన్న, అగ్ర రాజ్యం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులున్నారు. వీరిలో కొందరు అమెరికా పౌరసత్వం పొందినవారు ఉండగా మరికొందరు చదువులు, ఉన్నత ఉద్యోగాల కోసం వెళ్లినవారు ఉన్నారు. అయితే అమెరికా అనగానే అక్కడకు వెళ్లినవారంతా భారీగా సంపాదిస్తున్నారని అనుకుంటారు. తానా, నాటా, ఆటా వంటి మహాసభలు, ఇవి నిర్వహించే భారీ ఈవెంట్లు, టెస్లా కార్లలో విహరించడం వంటివాటిని చూసి మనవాళ్లు అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అనుకుంటారు. కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు.

అమెరికాలో ఉన్న భారతీయుల్లో అతి తక్కువ మంది మాత్రమే ఎలాంటి లోటు లేకుండా జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారట. మిగతా వారు ఇంకా కుదురుకునే స్థితిలోనే ఉన్నారట. మంచి ఉద్యోగం, ఆహార భద్రత, నివాసం తదితర విషయాల్లో ఇంకా చాలామంది భారతీయులు ఆశించినంత పురోగతిని సాధించలేదని తెలుస్తోంది.

ఈ మేరకు ఇటీవల ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఇటీవల ఒక ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. అమెరికాలో ఉంటున్న వివిధ ఆసియా అమెరికన్‌ సమూహాల ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులపై ఈ సెంటర్‌ ఒక నివేదికను వెలువరించింది.

ఆరు శాతం భారతీయులు, ఏడు శాతం పిలిఫ్పియన్‌ అమెరికన్లు తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక తెలిపింది. బర్మన్లు, మోంగ్‌ అమెరికన్లు వంటి ఇతరులు అధిక పేదరికాన్ని ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

ఆఫ్రికా, బర్మా దేశాల నుంచి వచ్చినవారితో పోలిస్తే భారతీయులు మెరుగ్గానే ఉన్నారని నివేదిక తెలిపింది.

భారతీయ అమెరికన్లకు ఉన్న మంచి నేపథ్యం, వృత్తిపరమైన నైపుణ్యాలు, చక్కటి ఆంగ్లంలో మాట్లాడగలగడం వంటి కారణాలతో ఆఫ్రికన్లు, బర్మన్లతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నారు.

అయినప్పటికీ, భారతీయులందరూ ధనవంతులనే అపోహ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. దీంతో సహాయం అవసరమైన వారికి ఇది అడ్డంకులు సృష్టిస్తోందని పేర్కొంది.

భారతీయ అమెరికన్లలో కొద్ది మంది మాత్రమే ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు. మిగతా వారిలో చాలామంది తమ బిల్లులు చెల్లించడం, ఆహార అభద్రతతో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. భారతీయ అమెరికన్‌ సమాజంలో ధనిక, పేదల మధ్య సంపద అంతరం గణనీయంగా ఉందని చెబుతున్నారు.

భారతీయ అమెరికన్లందరూ ధనవంతులు, విజయవంతమైన వారని భావించే వారికి ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ఆశ్చర్యం కలిగింవచ్చు. అయితే వాస్తవం ఏమిటంటే.. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారితో పోలిస్తే అమెరికాలో భారతీయుల జీవనం ఊహించినంత గొప్పగా లేదని అంటున్నారు. ఈ మేరకు నివేదిక ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది.

Tags:    

Similar News