ఆసిస్ గోల్డెన్ వీసా రద్దు... భారత్ కు ఎంత ఎఫెక్ట్?
ఇటీవల కాలంలో పలు దేశాలు వీసాల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కాలంలో పలు దేశాలు వీసాల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విదేశీ విద్యార్థుల పర్మిట్ల విషయంలో కెనడా ప్రభుత్వం పరిమితులు విధించగా.. యూఎస్ ప్రభుత్వం వీసా ప్రాసెసింగ్ ఫీజులను భారీగ పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గోల్డెన్ వీసాలను రద్దు చేసింది. దీంతో... భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఎంత అనే చర్చ మొదలైంది.
అవును... ప్రపంచంలోని పలు కీలక దేశాల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలోనే ఉంటుంటారు. ఈ నేపథ్యంలో... అత్యధిక జనాభా ఉన్న దేశం అయిన భారత్ లో ఆయా దేశాలు తీసుకునే వీసాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది నిత్యం చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో... ఆస్ట్రేలియా సర్కార్ తీసుకున్న గోల్డెన్ వీసాల రద్దు ఎఫెక్ట్ కూడా భారతీయులపై ఏ మేరకు ఉండొచ్చనే చర్చ మొదలైంది. దీనిపై నిపుణుల నుంచి స్పష్టత వస్తుంది.
విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు తమ దేశంలో నివసించేందుకు వీలుగా "గోల్డెన్ వీసా"లను ఆయా దేశాల ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్సించే మార్గాల్లో ఇదొకటి! ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఈ ప్రోగ్రాంని ప్రారంభించింది. దీని ప్రకారం... కనీసం 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేవారు ఈ వీసాతో ఐదేళ్ల పాటు అక్కడ ఉండొచ్చు.
ఈ క్రమంలో ఈ ప్రోగ్రాం కింద సుమారు లక్ష మంది వరకూ విదేశీయులు ఆస్ట్రేలియాలో రెసిడెన్సీ దక్కించుకున్నారని ఆసిస్ హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే... ఇందులో సుమారు 85శాతం మంది చైనా మిలియనీర్లే కావడం గమనార్హం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ ప్రోగ్రాంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగ... కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలించడానికి ఈ ప్రోగ్రాంను వాడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రాంని రద్దు చేయాలని ఆసిస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు... వీటిని రద్దుచేస్తున్నట్లు ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపైనే తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు.
ఇలా ఆస్ట్రేలియా గోల్డెన్ వీసా ప్రోగ్రాంలను రద్దుచేసిన ప్రభావం భారత్ పై ఏ మేరకు ఉండబోతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... ఈ ప్రభావం భారతీయులపై తక్కువగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కారణం... మొత్తం విదేశీ పెట్టుబడుల్లో భారత్ 17వ స్థానంలో ఉండటమే అని అంటున్నారు. మరోపక్క... వీటిస్థానంలో వృత్తి నిపుణుల వీసాలను పెంచుకోవాలని చూస్తున్న ఆలోచన భారత్ కు కలిసొస్తుందని భావిస్తున్నారు