వైసీపీ మాజీ మంత్రికి అదే అదృష్టమా...!?

ఇక అవంతి శ్రీనివాసరావు అంగబలం అర్ధబలం కలిగిన నాయకుడే. కానీ భీమునిపట్నంలో ఆయన పట్ల వ్యతిరేకత ఉందని గత సర్వేలు తేల్చాయి.

Update: 2024-01-09 03:50 GMT

వైసీపీకి చెందిన మాజీ మంత్రి భీమునిపట్నం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఖరారు అయింది అని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వరని మొదట్లో ప్రచారం సాగినా ఆయన ప్లేస్ లో ఎవరికి ఇవ్వాలని తర్జన భర్జనలు జరిగినా చివరికి అవంతి వద్దకే వచ్చి ఆగడం ఆయనకు రాజకీయ అదృష్టమే అని అంటున్నారు.

ఇక అవంతి శ్రీనివాసరావు అంగబలం అర్ధబలం కలిగిన నాయకుడే. కానీ భీమునిపట్నంలో ఆయన పట్ల వ్యతిరేకత ఉందని గత సర్వేలు తేల్చాయి. దాని మీద వైసీపీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో ఆయన పనితీరు మార్చుకోవాలని అధినాయకత్వం చేసిన సూచనల మేరకు అవంతి జనంలో ఉంటూ వచ్చారు. అది ఆయనకు ఎంతో కొంత హెల్ప్ అయింది అని అంటున్నారు.

అవంతి ప్రతీ నిత్యం జనంలో ఉండడం వల్ల గ్రాఫ్ అయితే బాగానే పెంచుకోగలిగారు అని అంటున్నారు. గతంతో పోలిస్తే వైసీపీకి కూడా హోప్స్ పెరిగాయని అంటున్నారు. అయితే టీడీపీ జనసేన పోటీ చేస్తే ఆ పొత్తు ప్రభావాన్ని తట్టుకుని అవంతి విజయం సాధిస్తే అది అద్భుతంగానే చూడాలని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ జనసేన రెండూ కలసినా ఆ పార్టీల మధ్య పొత్తు సాఫీగా సాగకపోతే ఓట్ల బదిలీ జరగకపోతే అది అవంతికే ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. భీమిలీలో కాపులతో పాటు పెద్ద సంఖ్యలో బీసీలు కూడా ఉన్నారు ఈసారి సీటు కోసం బీసీలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తే మాత్రం ఏ మేరకు టీడీపీ నుంచి సహకారం అందుతుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.

ఇక అవంతి శ్రీనివాసరావు చూస్తే రాజకీయంగా బాగా రాటుతేలిన నేతగా ఉన్నారు. ఆయన ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు టీడీపీలోనూ అజ్ఞాత మిత్రులు ఉన్నారని అంటున్నారు.

దాంతో ఆయన తనదైన రాజకీయ చాణక్యంతో ఈసారి నెట్టుకుని వస్తారు అని కూడా అనుచరులలో ధీమా ఉందిట. మరో వైపు చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాదిరిగా అవంతికి కూడా ఓటమి ఎరగని నేత అన్న ముద్ర ఉంది. దాంతో ఈసారి కూడా ఆయన గెలిచి తీరుతారు అని అంటున్నారు.

మరో విషయం ఏంటి అంటే ఆయన గతంలో దూరం పెట్టిన వర్గాలను సైతం కలులుకుని పోతున్నారు. ఆయన రాజకీయ విమర్శలు తగ్గించి తన గెలుపు కోసం సైలెంట్ గా బాటలు వేసుకుంటున్నారు. ఇటీవల తాడేపల్లికి చాలా మంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చినా అవంతికి మాత్రం రాలేదు. పైగా ఆయన కుమారుడికి వైసీపీ యూత్ వింగ్ లో కీలక పదవి దక్కింది.

దీన్ని బట్టి చూస్తే అధినాయకత్వం ఆశీస్సులు పూర్తిగా ఆయనకు ఉన్నాయని అంటున్నరు. మొత్తం మీద చూస్తే అవంతికి రాజకీయంగా అదృష్టం ప్రతీసారీ కలసివస్తోంది. ఈసారి కూడా ఆయన గెలిచి భీమిలీలో గత రెండు దశాబ్దాలలో వరసగా గెలిచిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేస్తారు అని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News