రాజీనామా ప్రచారం ఉత్తిదే.. అయోధ్య రామిరెడ్డి
వైసీపీ నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది.
రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైసీపీ నేత, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
వైసీపీ నేత వి.విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాతోపాటు ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికల్లో ఈ వార్త ప్రచురితమైంది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్యరామిరెడ్డి ఈ అంశంపై శుక్రవారం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. నెక్ట్స్ అయోధ్యరామిరెడ్డేనంటూ అంతా చర్చించుకున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై అయోధ్యరామిరెడ్డి శనివారం స్పందించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూ రాజీనామా ప్రచారాన్ని ఖండించారు.
విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి బాగా సన్నిహితులు. దీంతోనే విజయసాయిరెడ్డి తర్వాత అయోధ్యరామిరెడ్డే రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. వైసీపీలో టాప్ టెన్ లీడర్లలో ఈ ఇద్దరిదీ అగ్రస్థానం. దీంతో పార్టీలో కలకలం రేగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించగా, విదేశాల్లో ఉన్న అయోధ్యరామిరెడ్డిపై ఊహాగానాలు షికారు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన అయోధ్యరామిరెడ్డి తాను పార్టీని వీడేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యరామిరెడ్డి రాజ్యసభా సభ్యత్వం మరో ఏడాది ఉన్నట్లు చెబుతున్నారు. తన పదవీ కాలం ఉన్నంతవరకు ఎంపీగా కొనసాగుతానని అయోధయరామిరెడ్డి తేల్చిచెప్పారు.