అయోధ్య రామ మందిర విశేషాలు ఇవిగో!
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో నీలమేఘశ్యాముడి బాల రూపానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమం... మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రారంభమైంది. ఈ సందర్భంగా... ఈ నవనిర్మిత రామ మందిర విశేషాలు ఇప్పుడు చూద్దాం.!
అవును... అయోధ్యలో బాల రాముడి ఆలయాన్ని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. మొత్తం 2.77 ఎకరాల స్థలంలో నిర్మితమయిన అయోధ్య రామ మందిరంలో 392 పిల్లర్లు, 44 తలుపులు, 5 మండపాలు ఉన్నాయి. ఈ రామ మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు కాగా.. ఎత్తు 161 అడుగులు! ఈ సందర్భంగా 3 అంతస్థుల్లో నిర్మిస్తున్న ఈ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రధాన గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ఉంచారు.
ఇక ఈ ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉన్నాయి. అవి... సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం, నృత్య మండపం, రంగ మండపం! ఈ రామ మందిరానికి సమీపంలోనే ఒక బావి కూడా ఉంది. దీనిని "సీతా కూప" అని పిలుస్తారు. ఇదే సమయంలో ఆలయం నైరుతి భాగంలోని కుబేర్ తిల వద్ద పురాతన శివుని ఆలయాన్ని పునరుద్ధరించారు.
14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీటు ఆర్.సీ.సీ.తో నిర్మించిన ఈ రామమ మందిర పునాది, నిర్మాణంలో ఎక్కడా ఇనుము, సిమెంటు వాడలేదు. ఇదే సమయంలో... ఆలయ సముదాయంలో నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని ప్రమాదాల రక్షణ కోసం నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కర్మాగారం, విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇక ఈ అయోధ్య రమ మందిర నిర్మాణం కోసం ఇప్పటి వరకు సుమారు రూ.1100 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈ ఆలయం మొత్తం పూర్తి కావడానికి మరో రూ.300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో... ఈ మందిర నిర్మాణం 2024లోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇలా మిగిలిన పనులు రేపటి నుంచే తిరిగి ప్రారంభం అవుతాయని తెలుస్తుంది.