కళ్లకు గంతలు లేని రాముని ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి?

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏ మూలన చూసినా ఈ విషయంపైనే చర్చ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

Update: 2024-01-20 05:49 GMT

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏ మూలన చూసినా ఈ విషయంపైనే చర్చ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అటు భక్తి పరంగా, ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా కూడా ఈ విషయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ సమయంలో కళ్లకు గంతలు లేకుండా బాలరాముని ఫోటోలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అసలు ఈ ఫోటోలు ఎలా వచ్చాయనేది ఇప్పుడు కలకలం రేపుతున్న అంశంగా మారింది.

అవును... ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు ముందే బాల రాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. గురువారం రాముడి విగ్రహాన్ని వేద మంత్రాల నడుమ ఆలయ గర్భగుడిలోకి చేర్చగా... ఇదివరకే కళ్లకు గంతలు కట్టి వున్న రాముడి విగ్రహ ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే శుక్రవారం మాత్రం గర్భ గుడిలోకి చేర్చకముందే కళ్లకు గంతలు లేకుండా ఉన్న బాల రాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అనంతరం అవి వైరల్‌ గా మారాయి.

బాలరాముడు చేతిలో బంగారు విల్లు, బాణం ఉన్నట్లు ఈ ఫొటోలో చూడొచ్చు. అయితే, కళ్లకు గంతలు లేని ఈ ఫొటోలను అటు ఆలయ ట్రస్ట్‌ గానీ, ఇటు ప్రభుత్వం గానీ అధికారికంగా విడుదల చేయలేదు! అయినప్పటికీ ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర చీఫ్ ఈ విషయంపై స్పందించారు.

ఇందులో భాగంగా... ప్రాణప్రతిష్ట జరిగే వరకూ శ్రీరాముడి కళ్లు చూపించకూడదని, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫోటోలు నిజం కాదని, ఒకవేళ అవి రాముడి కళ్లే అయితే ఆ విషయంపై విచారణ చేస్తాం అని తెలిపారు. ఇదే సమయంలో అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయనే విషయంపైనా ఆరా తీస్తామని వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్.

కాగా... అయోధ్యలో తొలుత శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి ప్రధాని నరేంద్ర మోడీ తొలుత దర్శనం చేసుకుంటారని.. అనంతరం ఆయనే హారతి ఇస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవగిరి మహరాజ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కళ్లకు గంతలు లేని రాముని విగ్రహం నెట్టింట వైరల్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

Tags:    

Similar News