అయ్యోధ్య రామాలయం విశేషాల పుట్ట.. చదివితే అద్యంత ఆశ్చర్యమే

యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం చివరి దశకు రావటమే కాదు

Update: 2024-01-05 05:12 GMT

యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం చివరి దశకు రావటమే కాదు..ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రాములోరి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా నిర్మిస్తున్న ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి తాజాగా శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ పలు వివరాల్ని వెల్లడించింది. వీటిని చూసినప్పుడు కలిగే భావన ఒక్కటే.. టెక్నాలజీ అద్భుతంగా అయోధ్య రామాలయాన్ని చెప్పొచ్చు. మూడు అంతస్తుల్లో నిర్మించే ఈ భారీ ఆలయంలో ఒక్క ఇనుప చువ్వ కూడా వాడకపోవటం ఒక విశేషం అయితే.. ఈ భారీ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేసే రాముడి విగ్రహం సైజు ఎంతో తెలుసా? అక్షరాల 51 అంగుళాలు. అది కూడా బాల రాముడి అవతారంలో కనిపిస్తారు.

అయోధ్య రామాలయ నిర్మాణ విశేషాల్ని చూస్తే..

- తూర్పు నుంచి పడమరకు 300 అడుగుల పొడవు.. 250 అడుగుల వెడల్పు.. 161 అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం సాగింది. ఉత్తరభారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిల్లో ఒక దాన్నితీసుకున్నారు. ఈ తరహా ఆలయాలు పశ్చిమ.. తూర్పు భారతంలో కనిపిస్తాయి.

- 3 అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మొత్తంగా ఆలయానికి 392 స్తంభాలు.. 44 గేట్లు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ తోపాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం ఉంటుంది. ఆలయంలో ఐదు మండపాలు ఉంటాయి.

- ఈ ఐదు మండపాల్ని చూస్తే..

1. న్రత్య మండపం

2. రంగమండపం

3. సభా మండపం

4. ప్రార్థన మండపం

5. కీర్తన మండపం

- తూర్పున ఉండే సింహ ద్వారం నుంచి ఆలయం లోపలకు వెళ్లాలి. ఇక్కడ 32 మెట్లు ఉంటాయి. పెద్ద వయస్కులు.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారి కోసం లిఫ్టులు.. ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో 732 మీటర్ల పొడవుతో గోడ ఏర్పాటు చేశారు. దాని వెడల్పు 14 అడుగులు. ఆలయ ప్రహరీ ద్రవిడ ఆలయ కళలో ఉంటుంది.ఆలయ నిర్మాణ శైలి మాత్రంఉత్తర.. దక్షిణ శైలికి తగ్గట్లు ఉండటం ఒక విశేషంగా చెప్పాలి.

- ఆలయం నాలుగు మూలల నాలుగు ఆలయాల్నినిర్మిస్తున్నారు. ఇందులో సూర్య భగవానుడు.. భగవతి.. గణపతి.. శివుడి ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం.. దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది. పురాణ కాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది. వాల్మీకి.. వశిష్ఠ.. విశ్వామిత్ర.. ఆగస్త్య మహర్షులు.. నిశద్ రాజ్.. శబరి.. దేవి ఆహల్య ఆలయాల్ని అక్కడ నిర్మిస్తున్నారు.నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్ తిలపై ఉన్న పురాతన శివ ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే జటాయువు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

- భూమిలోని తేమ నుంచి ఆలయాన్ని రక్షించేందుకు వీలుగా గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. ఆలయంలో ఎక్కడా ఇనుము ఉపయోగించలేదు. ఆలయం కింద 14 మీటర్ల మందంలో రోలర్ కాంపాక్టు కాంక్రీట్ వేశారు. మురుగునీరు.. వాటర్ ఫ్యూరిఫైర్.. ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుంది.

- భక్తుల సౌకర్యం కోసం 25వేల మంది సామర్థ్యంతో ఉన్న ఒక ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ సామాన్లు భద్రపర్చుకునేందుకు వీలుగా లాకర్లు.. మెడికల్ సదుపాయాల్ని ఏర్పాటు చేశారు. మొత్తం 70 ఎకరాల్లో ఉండే ఈ ఆలయ విస్తీర్ణంలో 70 శాతం ఎప్పుడూ పచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది.. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకతగా చెప్పాలి.

Tags:    

Similar News