దొంగ పెన్షన్లు అంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయని దాని వల్ల ఖజానాకు ఆర్ధికంగా భారంగా మారుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు

Update: 2024-12-20 06:45 GMT

ఏపీలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయని దాని వల్ల ఖజానాకు ఆర్ధికంగా భారంగా మారుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయ్యన్న తన సొంత నియోజకవర్గం నర్శీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీలో పెద్ద ఎత్తున దొంగ పెన్షన్లు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏకంగా మూడు లక్షల 20 వేల పై చిలుకు దొంగ పెన్షన్లు ఉన్నట్లుగా సమాచారం ఉందని అన్నారు. తప్పుడుగా వయసు నమోదు చేయించుకోవడంతో పాటు ఇతర వివరాలు తప్పుగా ఇచ్చి పెన్షన్లు తీసుకుంటున్న వారు లక్షల్లో ఉన్నారని అన్నారు. వీరి వల్ల నెలకు నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పించన్లకు పెట్టే ఖర్చు అక్షరాలా 130 కోట్ల దాకా అవుతుందని లెక్క చెప్పారు. అదే అయిదేళ్ళకు తీసుకుంటే ఈ మొత్తం అక్షరాలా ఏడు వేల 500 కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు.

ఇంత పెద్ద మొత్తంలో అనర్హులు దొంగ పెన్షన్లు తీసుకుంటూంటే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. నర్శీపట్నంలోని తాండవ లాంటి ప్రాజెక్టులు మూడు 7,500 కోట్ల రూపాయలతో కట్టవచ్చునని ఆయన అన్నారు.

తాను అర్హులకు పెన్షన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టనని ఆయన అంటూ అనర్హులు పెన్షన్ తీసుకోవడం తగదని అన్నారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా తనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దొంగ పెన్షన్లను అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అంటూ ఇదే విషయం తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకుని వచ్చాను అని అన్నారు.

దొంగ పెన్షన్లను అరికడితే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అవుతాయని ఆయన అన్నారు. అలాగే అర్హులైన మరింతమందికి పెన్షన్లు కూడా ఇవ్వవచ్చు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

తప్పుడు వయసులో తప్పుడు వివరాలతో పెన్షన్లు తీసుకోవడం న్యాయమేనా అన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని అయ్యన్న అన్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా అనర్హులకు పెన్షన్ రద్దు చేయాలని ఆలోచనతో ఉంది. ఈ మేరకు డిసెంబర్ నెలలో సచివాలయ సిబ్బందితో రాండం గా సర్వే కూడా చేయించారు. అందులో ప్రతీ పదివేల మంది పెన్షనర్లలో అయిదు వందల మంది దాకా అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు.

వారిని నోటీసులు పంపించి వారి అర్హతను రుజువు చేసుకోలేకపోతే పెన్షన్లు రద్దు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే తప్పుడు వయసుతో పాటు తప్పుడుగా వివరాలు ఇచ్చి తమకు అంగ వికలత్వం ఉందని చెబుతూ చాలా మంది పెన్షన్లు పొందుతున్నారని కూడా అంటున్నారు. నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదని అర్హులకు అందింతే అది ఉపయోగమని అలా కాకుండా అనర్హుల పాలు అయితే ఖజానాకే చేటు అని అంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఆవేదన కూడా అర్ధం చేసుకోదగినదే అని అంటున్నారు.

Tags:    

Similar News