దేవాన్ష్ ఆటాపాటా.. నారావారిపల్లెలో సందడే సందడి
ఈ ఏడాది సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు దివంగతుడైనప్పటికీ ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నారావారిపల్లె వచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి కోలాహలం నెలకొంది. పండుగ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులు అంతా గ్రామానికి రావడంతో ఊరంతా సందడిగా మారింది. ఏటా సంక్రాంతికి సీఎం స్వగ్రామానికి వస్తుంటారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు దివంగతుడైనప్పటికీ ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు నారావారిపల్లె వచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ ఆయన సతీమణి బ్రాహ్మణి, చంద్రబాబు వియ్యంకురాలు, ఎమ్మెల్యే బాలయ్య భార్య వసుంధర తదితరులు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనవడు, లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఈ సారి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గ్రామానికి చెందిన పిల్లలతో ఆటపాటలతో హుషారుగా గడుపుతుండటంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా సీఎం సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు నిర్వహించారు. గ్రామస్థులు వేసిన రంగువల్లులను కోడలు బ్రాహ్మణితో కలిసి భువనేశ్వరి వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా, వారందరికీ 10,116 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు పిల్లల ఆటల పోటీలను తిలకించారు. ఈ పోటీల్లో మనవడు దేవాన్ష్ గోనె సంచెతో ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ చంద్రబాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు గ్రామస్థులు, విద్యార్థులు పోటీపడ్డారు. సీఎం కూడా ఓపిగ్గా అందరితో ఫొటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు.