దశాబ్దాల తర్వాత వేదికను షేర్ చేసుకుంటున్న బాబు.. దగ్గుబాటి
చంద్రబాబు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా ఉండేది.;
నారా చంద్రబాబు నాయుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్లను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి తరానికి అయితే మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలియాస్ డాక్టర్ గారి గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఎన్టీఆర్ అల్లుళ్లు అయిన ఈ ఇద్దరు.. రామారావు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. మొదట్లో ఈ ఇద్దరు నేతలు టీడీపీలో రెండు పవర్ సెంటర్లుగా ఉండేవారు. ఆ తర్వాత జరిగింది తెలిసిందే. చంద్రబాబు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా ఉండేది.
తర్వాతి కాలంలో టీడీపీకి చంద్రబాబు అన్నీ తానై కావటం.. కొద్దికాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరావు.. ఆయన సతీమణి పురంధేశ్వరి ఎన్ని పదవులు చేపట్టారన్నది తెలిసిందే. 2014 రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరటం.. రాజకీయంగా చంద్రబాబు ఫ్యామిలీకి.. దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య దూరం పూడ్చలేనంత ఎక్కువగా ఉండేది.
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించాలి. తోడళ్లులుగా ఉన్న చంద్రబాబు.. దగ్గుబాటి మధ్య మాటలు లేకపోవటం.. ఇద్దరి మధ్య అస్సలు పొసగని వైనానికి భిన్నంగా.. వారిద్దరి భార్యలైన పురందేశ్వరి.. భువనేశ్వరిల మధ్య రిలేషన్ మాత్రం బాగుండేది. ఏదైనా కార్యక్రమం జరిగితే వీరిద్దరూ మాట్లాడుకునే వారు. కలుసుకునేవారు. భర్తల మధ్య రాజకీయ విభేదాలు.. తమ వ్యక్తిగత జీవితాల్లోకి రానిచ్చేవారు కాదు. అక్కాచెల్లెళ్లుగా వారిద్దరి బంధం.. మిగిలిన పంచాయితీలకు భిన్నంగా ఉండేది. రాజకీయంగా ఇరు కుటుంబాల మధ్య ఎన్ని పంచాయితీలు ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం సాదాసీదా మాటలు ఉండేవి.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నేత్రత్వంలోని టీడీపీ బీజేపీ, జనసేనతో జత కట్టటం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు.. దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య రాజకీయ దూరం తగ్గింది. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు తోడల్లుళ్లు ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. ఇందుకు విశాఖ వేదికగా మారనుంది.
ఈ నెల ఆరున విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఒక కార్యక్రమం జరగనుంది. ఈ గీతం ఇంకెవరిదో కాదు.. నందమూరి బాలక్రిష్ణ చిన్న అల్లుడిదే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు. దాన్ని తెలుగు.. ఇంగ్లిషు భాషల్లో రచించారు. తెలుగు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఇంగ్లిషు పుస్తకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పురందేశ్వరిలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రోగ్రాంకు హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సభకు హాజరు కానున్నారు. దీంతో.. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక బహిరంగ వేదిక మీదకు ఈ ఇద్దరు ప్రముఖులు రాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. దగ్గుబాటి గురించి చంద్రబాబు ఏం మాట్లాడతారు? అన్నది ఆసక్తికర అంశంగా మారిందని చెప్పక తప్పదు.