జగన్‌కు కౌంటర్... చంద్రబాబుపై వత్తిడి.. ఏం జరిగింది..!
తమ హయాంలో మార్కెట్ రేటు రూ.21 వేల నుంచి 23 వేల వరకు పలికిందని.. ఇప్పుడు 13 వేలకు పడిపోయిందని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త చిక్కు వచ్చింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన పని.. కూటమిపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా జగన్.. మిర్చి రైతులకు ధర లభించడం లేదని పేర్కొంటూ.. గుంటూరు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి రైతులతో ముఖాముఖి అయ్యారు. తమ హయాంలో మార్కెట్ రేటు రూ.21 వేల నుంచి 23 వేల వరకు పలికిందని.. ఇప్పుడు 13 వేలకు పడిపోయిందని ఆరోపించారు.
దీనికి కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కారణమని కూడా జగన్ ఆరోపించారు. రైతులు నష్టపోతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ.. తాను దీనిపై ఇప్పటికే స్పందించానని..కేంద్రానికి లేఖ కూడా రాశానని చెప్పారు. మరో మంత్రి అచ్చెన్నాయు డు కూడా మీడియా ముందుకు.. వచ్చి.. తాముకేంద్రానికి రెండు లేఖలు రాశామని చెప్పారు. వీటిని మీడియాకు కూడా వెల్లడించారు. ఇదే చంద్రబాబు కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారింది.
కేంద్రంలో అధికారం పంచుకుంటున్నకూటమి.. భాగస్వామ్య పార్టీ టీడీపీ కేంద్రంపై వత్తిడి తీసుకురావా ల్సింది పోయి.. ఇలా లేఖలు రాయడం ఏంటనేది మేధావుల ప్రశ్న. అంతేకాదు.. ఇప్పటికే అనేక విష యాల్లో కేంద్రం నుంచి అందాల్సిన సొమ్ములు రాకపోయినా.. అడుగుతూనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. విజయవాడ వరదలకు సంబంధించి 6025 కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ రాసి.. వివరాలు చెప్పినప్పటికీ.. దీనికి సంబంధించి కేవలం 143 కోట్లు మాత్రమే ఇచ్చారు.
తాజాగా విపత్తు నిధుల కింద 600 కోట్లు ఇచ్చినా.. వాటిని భవిష్యత్తు అవసరాలకు వాడాలని మెలిక పెట్టా రు. దీంతోదీని నుంచి రూపాయి ఖర్చు చేసినా.. లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇక, వెనుకబడిన జిల్లాలకు నిధుల సంగతి పులుసులో కలిసిపోయింది. అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కూడా నిధుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంపైనా కేంద్రం ఆలస్యం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుపై వత్తిడి పెరుగుతోంది. కేంద్రంతో సంప్రదింపులు సరే.. వత్తిడి కూడా తీసుకురావాలని మేధావులు సూచిస్తున్నారు.