అంటే.. 9 నెలలు మర్చిపోయారా చంద్రబాబు?
తాజాగా గంగాధర నెల్లూరులో జరిగిన పార్టీ సభలో చంద్రబాబు మాట్లాడిన మాటల్ని విన్న తర్వాత.. ఆ విశ్లేషణలో నిజముందన్న విషయాన్ని ఒప్పుకుంటారు.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు ఆయన గురించి కొన్ని విషయాలు భలేగా చెబుతారు. చంద్రబాబులో ఇద్దరు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చే చంద్రబాబు అని.. మరో చంద్రబాబు అధికారం చేజారిన తర్వాత వస్తారని చెబుతారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. మరెన్ని ఇబ్బందులకు గురైనా.. చివరకు జైలుకు వెళ్లిన తర్వాత కూడా చంద్రబాబులోని రెండు క్యారెక్టర్లు స్థిరంగా ఉంటాయని చెబుతారు. ఈ మాటల్ని విన్నోళ్లు అస్సలంటే అస్సలు ఒప్పుకోరు. తాజాగా గంగాధర నెల్లూరులో జరిగిన పార్టీ సభలో చంద్రబాబు మాట్లాడిన మాటల్ని విన్న తర్వాత.. ఆ విశ్లేషణలో నిజముందన్న విషయాన్ని ఒప్పుకుంటారు.
అధికారంలో ఉన్న వేళలో పార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని మర్చిపోవటం.. ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండటం.. ప్రభుత్వాన్ని పని చేయించటం.. తాను పని చేయటం.. పెద్ద పెద్ద ప్లాన్లు.. విజన్లు అంటూ నిమిషం ఖాళీగా ఉండకుండా తనను తాను కొన్ని పరిమితులకు పరిమితం చేసుకోవటం చేస్తుంటారు చంద్రబాబు. అదే సమయంలో చేతిలో ఉన్న పవర్ చేజారిన తర్వాత మాత్రం తీరిగ్గా చింతిస్తారు. పవర్ లో ఉన్నప్పుడు నేతల్ని.. కార్యకర్తల్ని పట్టించుకోలేదని.. ఆ తప్పు మళ్లీ చేయనంటూ పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తారు.
మొత్తంగా చంద్రబాబు మారరు. పార్టీ క్యాడర్ తీరు మారదన్నట్లుగా ఉంటుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. చాలామంది కొత్త చంద్రబాబును చూస్తారని భావించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని సవాళ్లను ఎదుర్కోవటమే కాదు.. నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావటం.. ఆయనలో మార్పును తెస్తుందని ఆశించారు.
కానీ.. అధికారాన్ని చేపట్టిన తర్వాత మళ్లీ పాత చంద్రబాబే బయటకు రావటం.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం.. పాలనతో తీరిక లేకుండా ఉండిపోవటం.. పార్టీ ఆశల్ని..ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఉండటం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటారని చెప్పే కొందరు మీడియా మిత్రులు సైతం చంద్రబాబు తీరును తప్పు పట్టటం షురూ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు పట్టిన అధికార మత్తును వదిలించాయన్న మాట వినిపిస్తోంది.
దీనికి కారణం.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. అధికారంలో ఉన్న వేళలో తాను చేస్తున్న తప్పును ఒప్పుకోవటం చంద్రబాబులో చూసింది లేదు. అందుకు బిన్నంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిది నెలల్లో పార్టీ విజయం కోసం రక్తం చిందించిన కేడర్ గురించి ఆలోచించలేకపోయానని.. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది? ఇప్పటికిప్పుడు చంద్రబాబులో ఇంతటి మార్పునకు కారణం ఏమిటి? ఈ తొమ్మిది నెలలు తాను చేస్తున్న తప్పును ఆయన ఎందుకు గుర్తించలేదు? లాంటి ప్రశ్నలకు సైతం సమాధానం చెబితే బాగుంటుంది కదా? ఏమైనా.. అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు తన తప్పును తాను ఒప్పుకోవటం రోటీన్ కు భిన్నమని మాత్రం చెప్పక తప్పదు.