ఇకపై తెలుగులోనే జీవోలు.. చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగపడేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు భాషపై తన మమకారం చూపుతోంది ఏపీ ప్రభుత్వం తెలుగుకు వెలుగు వచ్చేలా ఇక పై మాతృభాషలో ప్రభుత్వ ఆదేశాలు (జీవో)ను వెలువరించనుంది. బుధవారం తొలి తెలుగు జీవోను విడుదల చేసింది. తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగపడేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ భాష లందు తెలుగు లెస్స అంటూ ఎప్పుడో రాయలువారి కాలంలోనే మన మాతృభాష అధికార భాషగా వర్ధిల్లింది. అయితే కాలక్రమంలో ఆంగ్ల ప్రభావంతో తెలుగు భాష మనుగడ ప్రమాదంలో పడిందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇక గత ప్రభుత్వంలో ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీషు మాధ్యమంలోనే బోధన జరిగేలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తన ఆందోళనలను, అభ్యంతరాలను వ్యక్తం చేసిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ జీవోలు కూడా తెలుగులో ఉండేలా చేస్తానన్నారు. అప్పటి హామీని సీఎం హోదాలో చంద్రబాబు నెరవేర్చారు.
తెలుగు భాష వెలుగులు పంచేలా ఇకపై రాష్ట్రంలో జారీ అయ్యే ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) తెలుగులో కూడా వెలువరించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నరు. బుధవారం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మొట్టమొదటి తెలుగు జీవో విడుదల చేశారు. హోంశాఖ జారీ చేసిన ఈ జీవో ద్వారా ఓ ఖైదీ పెరోల్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ తెలుగులో కూడా ఉండాలని ప్రభుత్వం ఆయా శాఖలకు సూచించింది. ముందుగా ఇంగ్లీషులో జీవో విడుదల చేస్తామని, తర్వాత రెండు రోజులకు తెలుగులో జీవో వెలువరిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ప్రతి జీవో ప్రజలు తెలుసుకునేలా పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాలని సూచించింది.
గత ప్రభుత్వంలో ఎక్కువగా జీవోలను రహస్యంగా జారీ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో కూడా జీవోలు అందుబాటులో ఉండటం లేదని అప్పట్లో టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా చరమగీతం పాడింది. ఇక తెలుగులో కూడా జీవోలు విడుదల కానుండటంతో ప్రభుత్వ పాలన వ్యవహారాలు, ఉత్తర్వులపై ప్రజలు సంపూర్ణంగా అవగాహన పెంచుకోవచ్చననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీషులో జీవోలు వస్తుండటం వల్ల 90 శాతం మంది అర్థం చేసుకోలేకపోతున్నారని అంటున్నారు. భవిష్యత్ లో తెలుగులో కూడా జీవోలు అందుబాటులో ఉండటంతో ఎవరూ తప్పుగా పొరబడాల్సిన ఇబ్బంది కూడా ఉండదని అంటున్నారు.