అసెంబ్లీలో అవమానాన్ని గుర్తు చేసుకున్న బాబు !
ఆనాడు జరిగిన సంఘటనలు తాను ఎంతలా బాధపడ్డానో ఒకసారి గుర్తు చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళేందుకు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం పెట్టి ఎన్నికల ఫలితాల మీద బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీని తాను బాయ్ కాట్ చేయడాన్ని సమర్ధించుకున్నారు. ఆనాడు జరిగిన సంఘటనలు తాను ఎంతలా బాధపడ్డానో ఒకసారి గుర్తు చేసుకున్నారు.
ఆ రోజున అసెంబ్లీలో తననూ తన సతీమణిని కూడా ఘోరంగా అవమానించారు అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తాను సభలో మాట్లాడుతాను అన్నా మైక్ ఇవ్వలేదని దాంతోనే తాను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సభకు ఇక రాను అని చెప్పానని గుర్తు చేశారు. కౌరవ సభగా మారిన ఈ సభను గౌరవ సభగా మార్చిన మీదటనే తాను వస్తాను అని కూడా చెప్పానని అన్నారు.
అసెంబ్లీలో ఆనాడు అకారణంగా తనను తన కుటుంబాన్ని నిందించారని బాబు మరో మారు బాధ వ్యక్తం చేశారు. 2003లో అలిపిరిలో జరిగిన ఘటనలో తాను మావోలు పెట్టిన బాంబులకు సైతం భయపడలేదని ధైర్యంగా తేరుకున్నానని ఆయన చెప్పారు. కానీ అసెంబ్లీలో మాత్రం తనను ఎంతో భయపెట్టాలని ఇబ్బందుల పాలు చేయాలని చూసారు.
ఇదే అసెంబ్లీలో ఘోరంగా తనను అవమానం చేశారు అని బాబు అన్నారు. అపుడే కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని చెప్పే వచ్చారు. తాను ఏదైతే ప్రతిజ్ఞ చేశానో దానిని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు అని చంద్రబాబు అన్నారు.
మొత్తం మీద చూస్తే చంద్రబాబు కుటుంబం మీద ఆనాడు అన్న మంత్రులు అందరూ ఈసారి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడమే కాకుండా వైసీపీకి కూడా ఎన్నడూ లేని విధంగా 11 సీట్లే దక్కాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అనడానికే ఇదొక ఉదాహరణ అని చెప్పాల్సి ఉంటుంది.
ఇంకో వైపు చూస్తే రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని దేశం రాష్ట్రం అభివృద్ధి మాత్రమే శాశ్వతం అని బాబు అన్నారు. ఆ విధంగా చూసుకుంటే అధికారం ఉందని ఎవరైనా అహంకారంతో విర్రవీగి ప్రవర్తిస్తే దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారు అనడానికే ఈ ఫలితాలు అని బాబు అన్నారు.
తాము అధికారాన్ని అతి పెద్ద బాధ్యతగా తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఉపయోగిస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీని అందరూ కోరుకున్నట్లుగా ప్రగతిపధంలో తీర్చిదిద్దుతామని దానికి ప్రజలు అంతా సహకరించాలని ఆయన కోరారు.