కేసులున్న ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!!
శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా బాబు ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గత ప్రభుత్వం హయాంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సుమారు 4,200 మందిపై కేసులు నమోదైనట్లు చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా బాబు ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
అవును... ఏపీలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, సామాన్య ప్రజల విషయాలను ప్రస్థావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసుల విషయాలను ప్రస్తావించారు.
వివరాళ్లోకి వెళ్తే... 2004లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీపీఎస్ అనే పెన్షన్ విధానం వల్ల తాము నష్టపోతున్నామని.. అందువల్ల ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)ను తీసుకురావాలని ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేశారు! ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీని నిలబెట్టుకోలేదు!
దీంతో.. 2019 ఎన్నికల ముందు జగన్ కూడా ఈ హామీ ఇచ్చారు. అయినా చేయకుండా కొత్తగా జీపీఎస్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో.. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయగా.. వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో... తాజాగా ఈ విషయాలపై చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ప్రస్థావించారు.
ఈ సందర్భంగా... సీపీఎస్ రద్దు చేయాలని నిరసనలు తెలిపినందుకు 4వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కేసులు పెట్టారు.. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అని చెప్పిన చంద్రబాబు.. ఆ కేసులన్నింటినీ సమీక్షించి, ఎత్తివేస్తామని తెలిపారు. దీంతో... ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఈ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా... ఈ సీపీఎస్ కు ఏడాదిలోగా పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు! దీంతో... ఉద్యోగులు పవన్ మాటపై ఎంతో నమ్మకంగా ఉన్నారని అంటున్నారు!!