పిల్ల‌ల్ని క‌న‌మంటున్న బాబుగారు.. అస‌లు సంగ‌తి ఏంటంటే.. !

ఎందుకంటే ఎలాగూ 'తల్లికి వందనం' వంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పిల్లలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న ఉద్దేశం ఆయనకు ఉండి ఉండవచ్చు.

Update: 2024-08-26 05:30 GMT

సీఎం చంద్రబాబు తన పాత విధానాలకు విరుద్ధంగా ప్రజలకు కొన్ని పిలుపులు ఇస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన సూచిస్తున్నారు. తాజాగా కోన‌సీమ‌లో జరిగిన గ్రామసభలో చంద్రబాబు ఇదే తరహా ప్రకటన చేశారు. ''పిల్లలను కనండి వాళ్ళని పెంచే బాధ్యత పోషించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంద``ని చమత్కరించారు. ఎందుకంటే ఎలాగూ 'తల్లికి వందనం' వంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పిల్లలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న ఉద్దేశం ఆయనకు ఉండి ఉండవచ్చు.

ఇక్కడ ఒకవైపు భారత్‌లో జనాభా పెరిగిపోతుందని జనాభాను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన చంద్రబాబు పిల్లల్ని కనాలని చెబుతున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే రాష్ట్రంలో ప్రస్తుతం యువత ఎక్కువగానే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారికి ఉపాధి కల్పనా ఉద్యోగ కల్పనా అనేది ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా కూడా మారింది. అయినాప్పటికీ చంద్రబాబు మరింత మంది పిల్లల్ని కనాలని ఎందుకు చెబుతున్నారు? భవిష్యత్తు అవసరాల కోసమా ? లేకపోతే భారతదేశం కూడా ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న వృద్ధుల జనాభా సమస్యను ఎదుర్కోకుండా ఉండడం కోసం చెబుతున్నారా ?

అంటే ప్రస్తుతానికైతే ఈ ఆలోచన చంద్రబాబుకు లేదు. ఆయన ఆలోచన వేరేగా ఉంది. అదేంటంటే జనాభా సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాను రాష్ట్రాలకు ఇస్తుంది. గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తుండడం మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

ఇదే విషయాన్ని గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున విమర్శించారు. జనాభా ప్రాతిపదికన డబ్బులు ఎలా ఇస్తారని ఎవరు ఎక్కువ పనులు కడుతుంటే వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ 15వ ఆర్థిక సంఘం మాత్రం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రానికి సూచించింది. దీని ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా నిధులు ఇస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటా కూడా ఇస్తుంది.

దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబు పిల్లల్ని కనండి అని పిలుపునిస్తున్నారనేది వాస్తవం. ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువగా పన్నులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన ఏర్పడుతుంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయన పిల్లల్ని కనమని పిలుపునిస్తుండడం గమనార్హం. చిత్రం ఏంటంటే 1995 -97 మధ్య `ఒకరు ముద్దు ఇద్దరు వద్దు` అన్న పిలుపు ఇచ్చింది చంద్రబాబు కావడం విశేషం.

Tags:    

Similar News