హైదరాబాద్ ఎందుకు బాబు గారు…అమరావతి ని చూడండి!
ఈ సందర్భంగా గతంలో హైదరాబాద్ ఎలా ఉండేది తాను ఎలా మార్చిందీ బాబు చెప్పుకొచ్చారు!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రత్యేకంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫెర్మార్మెన్స్ పై చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో ‘శాంతిభద్రతల’పై తాజాగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా గతంలో హైదరాబాద్ ఎలా ఉండేది తాను ఎలా మార్చిందీ బాబు చెప్పుకొచ్చారు!
అవును... ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు సర్కార్ వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శాంతిభద్రతలపైనా శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... గత ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించారని అన్నారు.
ఇదే క్రమంలో... గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు చేశారని ఆక్షేపించిన చంద్రబాబు... మూడు రాజధానుల బిల్లు సమయంలో శాసనమండలిలో దుర్మార్గంగా ప్రవర్తించారని అన్నారు. ఇదే సమయంలో... మండలి ఛైర్మన్ పనిచేయకుండా చేసి అల్లరి చేశారని ఫైరయ్యారు!
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ టాపిక్ ఎత్తిన ఏపీ సీఎం చంద్రబాబు... గతంలో హైదరాబాద్ లో మత ఘర్షణలు ఎక్కువగా జరిగేవని.. ఒకప్పుడు 30 రోజులపాటు కర్ఫ్యూ విధించే పరిస్థితులు ఉండేవని అన్నారు. అయితే... ఆ మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణిచివేశామని.. మత సామరస్యానికి విఘాతం కలగకుండా చేశామని చెప్పుకొచ్చారు.
అలాంటి హైదరాబాద్ నేడు అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని.. చంద్రబాబు వెల్లడించారు. ఇదే క్రమంలో... రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో వెళ్లామని తెలిపారు. అదేవిధంగా... ఏపీలో మావోయిస్టులను నియంత్రించామని బాబు పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా... హైదరాబాద్ గురించి ఇంకా ఎంతకాలం చెప్పుకుంటూ కాలం గడుపుతారు బాబు..? ఇప్పుడు అది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అని గుర్తుచేస్తూ... అమరావతి గురించి చూడండి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. హైదరాబాద్ అభివృద్ధికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అందులో చాలామంది పాత్ర ఉందని వివరిస్తున్నారు.
ఆ విషయం రెండు రాష్ట్రాల ప్రజలకూ తెలుసు అనే విషయం తెలిసి కూడా... కేవలం తన వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లు చంద్రబాబు ఎందుకు చెబుతుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా... ఇకపై దృష్టంతా అమరావతిపై పెట్టాలని.. రూ.15,000 కోట్లు వస్తే ఇక దూసుకుపోవడమే అని చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు!