ఇటు బాబు పవన్... అటు రేవంత్ భట్టి

ఏపీ సీఎం గా బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా తిరగకముందే బాబు తెలంగాణా తో విభజన సమస్యల మీద చర్చించేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-07-05 23:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 6న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ ఇద్దరితో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాలుపంచుకుంటారు అని అంటున్నారు.

ఇక ఈ భేటీ మీద సర్వత్రా ఆసక్తి వెల్లడి అవుతోంది. ఏపీ సీఎం గా బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా తిరగకముందే బాబు తెలంగాణా తో విభజన సమస్యల మీద చర్చించేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే టైం లో ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల భేటీలో అనేక కీలక అంశాలు అపరిష్కృతంగా ఉన్నవి అన్నీ ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు.

గతంలో ఒకసారి చూస్తే 2014లో ఏపీకి సీఎం గా చంద్రబాబు తెలంగాణాకు కేసీఆర్ అయ్యాక ఒకటి రెండు సార్లు కలిసినా ఈ స్థాయిలో భేటీ అయితే జరగలేదు. అలాగే 2019లో జగన్ ఏపీ సీఎం అయ్యాక కేసీఆర్ తో మొదట్లో తరచూ భేటీలు వేశారు. కానీ విభజన అంశాలమీద అయితే పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు అని అంటున్నారు.

అయితే గడచిన పదేళ్లలో చూసుకుంటే ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే గత పదేళ్లలో విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటి సారి అని చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఈ భేటీలో ముఖ్యంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా చాలా కాలంగా పెండింగులో ఉన్న విద్యుత్‌ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా చర్చిస్తారు. ఈ బకాయిలు చూస్తే కనుక దాదాపు రూ.24వేల కోట్ల రూపాయలు తెలంగాణా ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది.

అదే సమయంలో ఏపీకి రూ.7వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం కూడా చెప్పుకొస్తోంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య పేచీగా మారింది. మరి దీని మీద ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాల్సి ఉంది. ఇక ఢిల్లీలోని ఆంధ్రా భవన్ విషయంలో అయితే విభజన వివాదం పరిష్కారమైంది. అంతే కాదు మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన వివాదానికి పరిష్కారం దొరికింది. అయితే చాలా కీలకమైన సమస్యలే పెండింగులో ఉన్నాయని అంటున్నారు. వాటి పరిష్కారం కనుక అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సక్సెస్ అయినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News