బాబుకు ఐటీ నోటీసులు...జగన్ కి లింకేంటి...?

అయితే ఆయన ఐటీ నోటీసుల మీద డైరెక్ట్ గా మాట్లాడకుండా తన మీద తప్పుడు కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు అంటూ ఎదురుదాడి చేశారు.

Update: 2023-09-06 14:04 GMT

చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయి. 118 కోట్ల రూపాయల విషయంలో లెక్క తేలడం లేదు అంటూ ఈ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. గత ఏడాది అంటే 2022 సెప్టెంబర్ లో ఐటీ ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. అలా నాలుగు సార్లు నోటీసులు సర్వ్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంత జరిగినా తెలుగు మీడియాకు ఏ మాత్రం ఈ వ్యవహారం గుట్టు తెలియకపోవడం విశేషం. ఇక ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ విషయం రీసెంట్ గా బయటపెట్టింది. దాంతో ఈ మొత్తం వ్యవహారం మీద తెలుగు రాజకీయాలు మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయమని వైసీపీ నేతలు మంత్రులు యధాప్రకారం విమర్శలు చేస్తూ వచ్చాయి.

చంద్రబాబు ఈ విషయం మీద మౌనం వీడాలని మాట్లాడాలని కూడా వైసీపీ నుంచి గట్టిగా డిమాండ్ వచ్చింది. అయితే కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు ఈ విషయం మీద మౌనం వీడారు. అయితే ఆయన ఐటీ నోటీసుల మీద డైరెక్ట్ గా మాట్లాడకుండా తన మీద తప్పుడు కేసులు పెట్టేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు అంటూ ఎదురుదాడి చేశారు.

కొన్ని సంస్థలను తన మీద చెప్పమని ఎగదోస్తున్నారు అని ఆయన అంటున్నారు. తనను ఎలాగైనా బదనాం చేయాలని చూస్తున్నారు అని వాపోయారు. తన మీద దాడి చేయాలని తనను అరెస్ట్ చేయాలని వైసీపీ పన్నాగం అని కూడా విమర్శించారు. ఇదంతా చూస్తూంటే ఐటీ నోటీసుల విషయంలో ఏమైనా జరిగితే దాన్ని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేసి చుట్టేయాలని బాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.

నిజానికి చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశం ఎంత వరకూ ఉంటుంది అన్నది చర్చ. అలా జరగదనే అంటారు అంతా. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీది ఉంది. బీజేపీతో చెలిమి చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు. అదే టైం లో పొత్తులు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధపడాలనుకుంటున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలోనే పనిచేస్తాయని ఎవరైనా చెబుతారు. చూడబోతే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి, అందునా తెలుగు రాజకీయాలలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇస్తారా అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది.

అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎందుకు ఇలా చేస్తారు అని ఆ వెంటనే ప్రశ్న రావచ్చు. ఏపీలో మిత్రుడిగా ఉంటాను అంటున్న ఒక రాజకీయ పార్టీ విషయంలో ఇలా చేస్తారా అంటే పాలిటిక్స్ లో ఏమైనా సాధ్యమే అని కూడా అనుకోవచ్చు. అయితే మరో వైపు చూస్తే ఐటీ శాఖ తన రెగ్యులర్ విధులలో భాగంగా నోటీసులు జారీ చేసింది అని అనుకున్నా నాలుగు సార్లు నోటీసులు ఇవ్వడం, ఏడాదిగా ఇదే పని మీద ఉండడంతో ఇది కాస్తా సీరియస్ వ్యవహారంగానే ఉంది అని అంటున్నారు.

ఇక అమరావతిలోని తాత్కాలిక నిర్మాణాల విషయంలో పేరెన్నిక గన్న సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో అవినీతి జరిగిందని అంటూ వైసీపీ గతంలో పెద్ద ఎత్తున ఆరోపించింది. గతంలో కూడా అమరావతి రాజధాని వెనక అవినీతి ఉందని కూడా వైసీపీ అంటూ వచ్చింది. లేటెస్ట్ గా ఆ పార్టీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అయితే ఐటీ ఆషామాషీగా నోటీసులు చంద్రబాబుకు ఇవ్వలేదని అంటున్నారు.

లోతైన విచారణ జరిపే నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. ఇక కేవలం 118 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే కాదని స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వ్యవహారాలు. అలాగే ఫైబర్ గ్రిడ్ వ్యవహారాలతో పాటు చాలా ఇందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2014 నుంచి 2019 దాకా నడచిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద లోతైన విచారణ జరగాలని వైసీపీ కోరుకుంటోంది. ఇక తీగ ఇపుడు ఐటీ తీసింది కాబట్టి ఐడీ సీబీఐ కూడా రంగ ప్రవేశం చేసి డొంక లాగాలని కూడా అంటోంది.

చంద్రబాబు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ వైసీపీ మీద జగన్ మీద విమర్శలు చేయడం వెనక కేవలం ఏపీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు సింపతీ కోసమే అని అంటున్నారు. ఈ కేసు విషయంలో ఈ రోజుకు అయితే ఏమీ జరగలేదు రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు, జరగకపోవచ్చు.

ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటీసులు ఇస్తే అది జగన్ మీదకు తిప్పడం వెనక బాబు వ్యూహం ఏమై ఉంటుంది అన్నది మరో చర్చ. ఇదిలా ఉంటే ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. జనసేన కూడా ఏమీ అనడంలేదు, మొత్తానికి చూస్తే ఇందులో ఏమి జరుగుతోంది, ఎవరి వ్యూహాలు ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News