సుప్రీం కోర్టు ఆదేశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు-మన సంపద కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-01 11:39 GMT

ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ తీర్పును స్వాగతించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ....ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఈ ఉప వర్గీకరణ వెనుక చంద్రబాబు పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు-మన సంపద కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం, దామాషా పద్ధతి ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి కేటగిరిలను తీసుకువచ్చామని గుర్తు చేసుకున్నారు. 1996-97లో రామచంద్రరావు కమిషన్‌ వేసి ఏబిసిడి వర్గీకరణ తానే తెచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు దానిని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గుర్తించిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతోనే టిడిపి ముందుకు పోతుందని చెప్పారు.

గత ఎన్నికల్లో టికెట్లు కేటాయింపులు కూడా ఎస్సీలలో ఏ,బి,సి,డిలకు అనుగుణంగానే చేశామని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అందరిదని, ప్రజల ప్రభుత్వం అని, తాను అందరివాడిని చంద్రబాబు చెప్పారు. ఇక, గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకోలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. నీటి వల్ల సంపద సృష్టించవచ్చని, తద్వారా పేదరికం నిర్మూలించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపవచ్చని చంద్రబాబు అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు అన్నారు. అంతకుముందు శ్రీశైలంలో పర్యటిస్తున్న చంద్రబాబు శ్రీశైలం మల్లన్నను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు ఆ తర్వాత కృష్ణానదికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. సీఎం హోదాలో తొలిసారిగా చంద్రబాబు ఆలయానికి రావడంతో అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Tags:    

Similar News