వైనాట్ అంటున్న బాబు...వైసీపీకి అదే వజ్రాయుధం!

మొత్తం తెలంగాణాలో 119 సీట్లకు అభ్యర్ధులను పోటీకి పెట్టి అందులో కనీసం అరడజన్ సీట్లు గెలుచుకున్నా టీడీపీ వేవ్ ఉందని చెప్పి ఏపీలో ఆ ప్రభావాన్ని చూపించి 2024లో గెలవాలని బాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.

Update: 2023-08-29 04:38 GMT

చంద్రబాబునాయుడు ఆశలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆయన ఉమ్మడి ఏపీకి దాదాపుగా పదేళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఆ రికార్డు ఎవరూ బద్ధలు కొట్టనిది. శాశ్వతమైనది. ఇక విభజన ఏపీతో కలుపుకుంటే 14 ఏళ్ళు. ఈ రికార్డుని ఏపీలో బద్ధలు కొట్టాలని జగన్ చూస్తున్నారు. ముప్పయ్యేళ్ల సీఎం తానే అని ఆయన అంటున్నారు. తెలంగాణాలో అయితే మూడవసారి కేసీయార్ గెలిస్తే బాబు ఉమ్మడి ఏపీ విభజన ఏపీ రికార్డులు బద్ధలు అవుతాయని అంతున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో పోటీ చేస్తామని టీడీపీ ఉవ్విళ్ళూరుతోంది. పొత్తు పార్టీలే దొరకడంలేదు. బీజేపీతో అక్కడ జూనియర్ పార్టనర్ గా పొత్తుకి దిగి ఏపీలో బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకుందామని టీడీపీ ఎత్తులు వేసినా ఆంధ్రా నాయకులతో పొత్తు అని తెలంగాణా సెంటిమెంట్ కార్డు కేసీయార్ తీస్తారని బీజేపీకి భయంగా ఉందిట. దాంతో బీజేపీ టీడీపీ పొత్తుల ఊసు ఎత్తడంలేదు. దాంతో చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు.

అది కాస్తా వై నాట్ 119 అనే దాకా వెళ్ళిపోయింది. నిజానికి విభజన తరువాత తెలంగాణాలో టీడీపీ బాగా తగ్గిపోయింది. 2014లో గెలిచిన సీట్లు కూడా నిలబెట్టుకోలేదు. 2018లో కూడా దెబ్బ తింది. అయితే 2023లో కలసివస్తుందని బాబు ఊహిస్తున్నారు. దానికి కారణం ఆయన ఆ మధ్య ఖమ్మంలో నిర్వహించిన సభ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత హైదరాబాద్ సభ కూడా సక్సెస్ అయింది. ఇక బీసీ లీడర్ అయిన కాసాని జ్ఞానేశ్వర్ కి పార్టీ పగ్గాలు అప్పగించారు.

దాంతో కీలకమైన జిల్లాలు అయిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబా ద్ ల మీద బాబు టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం 119 సీట్లకు అభ్యర్ధులను పోటీకి పెట్టి అందులో కనీసం అరడజన్ సీట్లు గెలుచుకున్నా టీడీపీ వేవ్ ఉందని చెప్పి ఏపీలో ఆ ప్రభావాన్ని చూపించి 2024లో గెలవాలని బాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.

ఇక సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట టీడీపీని ఆదరిస్తారు అని బాబు భావిస్తున్నారు అంటున్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధితో పాటు, విజన్ 2020 వల్ల హైదరాబాద్ బాగుపడిందని స్లోగన్ తో దూసుకుని పోవచ్చు అని భావిస్తున్నారుట. ఇక మొత్తానికి మొత్తం అభ్యర్ధులను ప్రకటించి ఆ మీదట బస్సు యాత్రకు కూడా బాబు సిద్ధపడుతున్నారు.

అయితే బాబు అనుకున్నది జరిగితే ఏపీలో టీడీపీకి కొత్త బలం వస్తుంది. రేపటి ఎన్నికల్లో అది ప్లస్ అవుతుంది. కానీ అలా కాకుండా మొత్తం 119 సీట్లలో పోటీ చేసి ఎక్కడా గెలవకుండా ఉంటే కనుక వైసీపీకి అది వర్జాయుధమే అవుతుంది అని అంటున్నారు. తెలంగాణాలో బాబుని ఓడించారు అని ఇక ఆయన పని అయిపోయిందని, టీడీపీకి ఇక ఓటమే అని చెప్పి వైసీపీ విపరీతంగా ప్రచారం చేసి లబ్ది పొందే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తెలంగాణాలో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి తీరుతామని లెక్క వేసుకుంటున్నారు.

రెండు సార్లు అధికారంలో ఉన్న బీయారెస్ మీద వ్యతిరేకత ఉందని, దాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ కొంత వెనకబడ్డాయని, ఈ పార్టీల తీరుని చూసిన వారు ప్రత్యేకించి సెటిలర్స్ టీడీపీని ఆదరిస్తారు అని నమ్మకం పెట్టుకున్నారుట. మరి బాబు ఆశలు నెరవేరుతాయో లేదో చూడాల్సిందే.

Tags:    

Similar News