హాట్ టాపిక్... తమ్ముళ్ల అంతర్మథనం బాబుకు అర్ధమవుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటూ బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే... వచ్చే ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే వెళ్తామని అధికార వైసీపీ గంటాపథకంగా చెబుతుండగా.. బాబు మాత్రం పొత్తులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది! ఇప్పుడు ఈ విషయమే తమ్ముళ్లలో కొత్త టెన్షన్ పుట్టిస్తుందని.. ఈ విషయం బాబుకు అర్ధమైతే బాగుండని అంటున్నారు!!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ, టీడీపీలు ఎవరి వ్యూహాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ గెలవాలని, ఏపీలో ప్రతిపక్షం అనే మాట వినిపించకూడదన్నట్లుగా విజయం సాధించాలని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని.. అందుకోసం ఎంత దిగడానికైనా సిద్ధపడాలని బాబు భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బాబు.. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తాపత్రయ పడుతున్నారని అంటున్నారు.
వాస్తవానికి ఏపీలో సామాజిక సమీకరణలను బేరీజు వేసుకున్న చంద్రబాబు... జనసేనతో పొత్తుపెట్టుకోవడం వల్ల కాపు సామాజికవర్గ ఓట్లు బలంగా తమకు పడతాయని భావించారని అంటారు! ఈ క్రమంలోనే కాపులపై బాబు ఆస్థాయిలో ఆధారపడ్డారు.. ఈ సమయంలో చంద్రబాబును పాల ముంచినా, నీట ముంచినా కాపులే అని చెబుతూ భారీగా సీట్లు అడుగుతున్నారట జనసేన నేతలు, శ్రేయోభిలాషులు!
దీంతో తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. ఉదాహరణకు జోగయ్య లాంటి వారు జనసేనకు 50 సీట్లకంటే తక్కువ ఇస్తే కాపు ఓటు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వడని స్పష్టం చెబుతున్నారు. ఇది కచ్చితంగా టీడీపీకి టెన్షన్ తెప్పించే విషయంగానే భావించాలి!! ఇదే సమయంలో ఇప్పుడు తాజాగా బీజేపీ కూటా రంగంలోకి దిగడంతో... ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే టెన్షన్ తమ్ముళ్లలో పెరిగిపోయిందని అంటున్నారు.
వాస్తవానికి నిన్నటివరకూ ఎవరు ఎన్ని అనుకున్నా.. జనసేనకు 20 - 25 సీట్లు ఇవ్వాలని 2 - 3 లోక్ సభ టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావించారని కథనాలొచ్చాయ్యి! ఈ విషయంలో పవన్ నుంచి అభ్యంతరాలు రావనేది బాబు నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు.. అమిత్ షా - జేపీ నడ్డాలతో భేటీ అయిన నేపథ్యంలో... బీజేపీ - జనసేలకు కలిపి 40 అసెంబ్లీ 6 - 8 లోక్ సభ స్థానాలు ఇవ్వడానికి బాబు సిద్ధపడ్డారని అంటున్నారు!!
అయితే... ఈ విషయంలో బీజేపీ పెద్దలు మాత్రం జనసేన - బీజేపీకి కలిపి 55 - 60 అసెంబ్లీ స్థానాలు, 10కి తగ్గకుండా పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారని సమాచారం! ఈ నేపథ్యంలో... ఆలోచించుకోవడానికి బాబు కాస్త సమయం అడిగినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీలోని కొంతమంది సీనియర్లతో ఈ విషయంపై చర్చించి అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
సరిగ్గా ఇక్కడే తమ్ముళ్లలో తీవ్రస్థాయిలో టెన్షన్ మొదలైందని అంటున్నారు. జనసేనతో పొత్తు పుణ్యమాని ఇప్పటికే 25 - 30 (అసెంబ్లీ + లోక్ సభ) అభ్యర్థులు త్యాగాలు చేయాల్సి వస్తుంటుండగా.. ఇప్పుడు బీజేపీతో కూడా జతకట్టి సుమారు 50 - 60 మంది త్యాగాలు చేయాల్సి వస్తే ఆ పరిస్తితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుందని కుమిలిపోతున్నారని అంటున్నారు. ఇక్కడ రెండు రకాల సమస్యలు ఉన్నాయనేది వారి ఆవేదనగా ఉందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఒకటి... 50 - 60 మందికి టిక్కెట్లు ఇవ్వకపోతే వారిలో ఎంతమంది రెబల్స్ గా మారతారు అనేది ఒక టెన్షన్ అయితే... 50 - 60 స్థానాలు బీజేపీ - జనసేనకు ఇస్తే రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. బాబు పిలక వారి చేతుల్లోకి వెళ్లడం.. అనంతరం పార్టీలో భారీ చీలికలు తెచ్చే అవకాశాం కూడా ఉండటం.. ఆనాక టీడీపీ కాస్త మహారాష్ట్రలో ఎన్సీపీ తరహాలో అయిపోతుందేమో అని ఆవేదన చేందుతున్నారని అంటున్నారు.