మంత్రి పదవి ఎందుకు రాలేదో చెప్పిన తమ్ముడు

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి మరి కొద్ది రోజులలో నెల రోజులు పూర్తి చేసుకోబోతోంది

Update: 2024-07-06 03:54 GMT

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి మరి కొద్ది రోజులలో నెల రోజులు పూర్తి చేసుకోబోతోంది. అయితే మంత్రి పదవుల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ చాలా మంది ఆశావహులు ఉన్నారు. అయితే కొందరికే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి మీద విజయనగరం జిల్లా నుంచి ఆశ పెట్టుకున్న వారిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఒకరు.

ఆయన ముప్పయ్యేళ్ళుగా టీడీపీ జెండా ఎగరని బొబ్బిలిలో పార్టీని గెలిపించి తాను ఎమ్మెల్యే అయ్యారు. బొబ్బిలిలో వైసీపీ స్ట్రాంగ్. అలాంటి చోటు నుంచి గెలిచి వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ పదవి బేబీ నాయనకు దక్కలేదు.

గజపతినగరం నుంచి కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండపల్లి శ్రీనివాస్ కి దక్కింది. దాంతో తాజాగా బొబ్బిలి లో జరిగిన ఒక కార్యక్రమంలో బేబీ నాయన హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఎందుకు రాలేదో చెప్పారు. తన కుటుంబం అంతా చిన్నప్పుడు చెన్నైలో ఉండేదని తన సొంత గడ్డ బొబ్బిలి మీద మమకారంతో తాను ఇంట్లో గొడవ పడి వచ్చేశాను అని అన్నారు.

అయితే తన తల్లి డిగ్రీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వెళ్ళు అని షరతు పెట్టారని అయినా తాను బొబ్బిలిలో ప్రజా జీవితంలో పడిపోయి ఉన్నత చదువులు కొనసాగించలేకపోయాను అని ఆవేదన చెందారు. అలా అమ్మ చెప్పిన మాట వినకపోవడం వల్లనే తాను ఈ రోజు మంత్రిని కాలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యావంతుడు అయిన కొండపల్లి శ్రీనివాస్ కి ఆ పదవి రావడం సహేతుకం అని బేబీ నాయన అన్నారు. తాను ఆయన్ని అభినందిస్తున్నాను అని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ చదువుకోవాలని ఆయన కోరడమూ విశేషం. అయితే బేబీ నాయన ఆవేదన వెనక ఈ కధ చెప్పినా చదువులు లేని వారూ గతంలోనూ ఇపుడూ మంత్రులు అయిన ఉదంతాలు ఉన్నాయి.

అలాగే ఉన్నతమైన రాజ్యాంగ పదవులు అందుకున్న వారూ ఉన్నారు. అది మంత్రి పదవులకు క్రెడిటేరియా కాదు అని చెప్పవచ్చు. రాజకీయ సామాజిక సమీకరణలు ఇంకా ఇతరత్రా విషయాలు ఎన్నో ఉంటాయి. బొబ్బిలి కోట రాజకీయంగా పటిష్టం అయితే విజయనగరం కోటకు ఇబ్బంది అని తలచి తెర వెనక చెక్ చెప్పేలా రాజకీయం సాగింది అన్న చర్చ ఉండనే ఉంది.

అయితే ప్రతీ వారూ తమకు మంత్రి పదవుల మీద మోజు లేదు అంటూనే ఆవేదన ఏదో రూపంలో వ్యక్తం చేయడం టీడీపీలో జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కు చెందిన కూన రవికుమార్ తన గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో స్పీకర్ ని అభినందిస్తూ మరో మాజీ మంత్రి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు తాను 1983 నుంచి టీడీపీలో ఉన్నాను అని చెప్పుకోవడం కూడా మంత్రి పదవికి అర్హత కోసమే అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా మెల్లగా మొదలైన ఈ అసంతృప్తిని గ్రహించి వారికి సముచితమైన స్థానం కల్పించకపోతే ఇబ్బందులు ముందు ముందు వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News