హిందూపురం నుంచి బాలయ్య తప్పుకుని ఆమె ఎంట్రీ ?
అన్న ఎన్ టీఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన రికార్డుని తాజా గెలుపుతో తనయుడు బాలయ్య సమం చేశారు.
హిందూపురం పేరు చెబితేనే తెలుగు తమ్ముళ్ళకు ఆనందం కలుగుతుంది. దాని పేరునే వారు మార్చేశారు. అది నందమూరిపురం అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. దానికి కారణం టీడీపీ పుట్టాక అక్కడ మరో పార్టీ గెలిచింది. లేదు. అన్నింటికంటే కూడా నందమూరి కుటుంబమే ఏకంగా ఏడు సార్లు గెలిచిన నియోజకవర్గం అది. అన్న ఎన్ టీఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన రికార్డుని తాజా గెలుపుతో తనయుడు బాలయ్య సమం చేశారు. ఇక ఒకసారి నందమూరి హరిక్రిష్ణ కూడా గెలిచారు.
ఇదిలా ఉంటే హిందూపురం తన అడ్డాగా బాలయ్య మార్చేసుకున్నారు. ఆయన వరసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. ఇక ఆయన అన్ స్టాపబుల్ అని అంటున్నారు. అక్కడ బాలయ్య పోటీ చేయడమే తరువాయి గెలుపు లాంచనమే అన్నంతగా మారిపోయింది.
అదే విధంగా చూస్తే సరైన ప్రత్యర్ధి పార్టీలు కూడా హిందూపురంలో లేవు. వైసీపీకి కూడా లీడర్ షిప్ సమస్య ఉంది. మొత్తానికి చూస్తే హిందూపురం ఇక ఎప్పటికీ బాలయ్యదే అని అంటున్నారు. ఆ మాట ఎవరో కాదు సాక్ష్తాత్తు టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాలయ్యకు పద్మభూషణ్ దక్కిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయ్య సినీ సేవా రాజకీయ రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్నారని కొనియాడారు.
ఆయన మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అని ఇది మామూలు విషయం కాదని అన్నారు. ఆయనదే ఎప్పటికీ హిందూపురం అని కూడా చంద్రబాబు చెప్పేశారు. అంటే బాలయ్య వద్దు అని చెప్పాలి తప్ప ఆయన పోటీ చేసినన్నాళ్ళూ టికెట్ ఖాయమని ప్రకటించేసారు అన్న మాట. ఈ సందర్భంగా ఒక కొత్త విషయాన్ని కూడా చంద్రబాబు చెప్పారు.
బాలయ్య తన వద్దకు వచ్చి హిందూపురం టికెట్ ని తన సతీమణీ వసుంధరకు ఇవ్వమని అడుగుతూ ఉంటారని అన్నారు. అయితే అది ఆమెను మెప్పించడానికా నిజంగానా అన్నది తనకు అర్ధం కావడం లేదని అన్నారు. అయితే పక్కనే ఉన్న బాలయ్య కలుగచేసుకుని రెండు టికెట్లు అని అన్నారు. దానికి చంద్రబాబు బదులిస్తూ ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్ అని నవ్వుతూ వేదిక మీద చెప్పడం జరిగింది.
ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య తన సతీమణిని హిందూపురం నుంచి దించాలని చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే హిందూపురంలో బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ వసుంధర అన్ని పనులూ చూస్తూంటారు. ఆమెకు మొత్తం నియోజకవర్గం అంతా పరిచయమే. దాంతో ఆమెకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తున్నారా లేక సరదాగా ఆయన తన సతీమణికి టికెట్ అంటున్నారా అన్నది చూడాల్సి ఉంది.
ఏది ఏమైనా మరో నాలుగేళ్ళకు పైగా ఎన్నికలకు సమయం ఉంది. అప్పటికి హిందూపురం పోటీ సంగతి చూసుకోవచ్చు అన్న మాట ఉంది. అయితే బాలయ్య మాత్రం కచ్చితంగా పోటీ చేసి తీరుతారు అన్నది కూడా ఉంది. సో చూడాలి మరి వసుంధర పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతారో ఏమిటో అన్నది.