"పవన్ కు నాకు మధ్య సారూప్యత ఉంది"... బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ క్రమంలో తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

Update: 2023-11-16 07:53 GMT

రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని అధికారికంగా ప్రకటన అనంతరం టీడీపీ - జనసేనలు ప్రస్తుతం సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సమన్వయానికంటే ముందు సీట్ల సర్ధుబాటు కూడా ముఖ్యం, లేదంటే చివర్లో రెబల్స్ తో కొత్త తలనొప్పులు తప్పవనే మాటలు వినిపిస్తున్న సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఈ సమన్వయ కమిటీలో మైకందుకున్న బాలయ్య... పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం టీడీపీ - జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశాల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ కు తనకూ మధ్య సారూప్యత ఉందని చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... ముందుగా... "టీడీపీకి అండగా నిలుస్తున్నందుకు తమ్ముడు పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు" అని మొదలుపెట్టిన బాలయ్య... ఇద్దరికీ మధ్య సారూప్యత ఉందని తెలిపారు. ఇందులో భాగంగా... తాను కానీ, పవన్ కానీ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతామని అన్నారు. తామిద్దరమూ ఎవరికీ భయపడబోమమని.. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఇక ఏపీ అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తాయని వెల్లడించిన బాలయ్య... టీడీపీ - జనసేన కలవడం ఒక కీలకమైన ఘట్టమని అన్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు కూడా పార్టీలన్నింటినీ ఏకం చేసి అన్యాయంపై తిరుగుబాటు చేసారని.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే... నాటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు.

ఈ విధంగా... టీడీపీ - జనసేన కలయిక కొత్త శకానికి నాంది పలికినట్టేనని పేర్కొన్న బాలకృష్ణ... సీట్ల లెక్క కాదు, రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ తాము, జనసైనికులు కలిసి రక్షక భటులుగా ఉంటామని బాలయ్య అన్నారు. ఇదే సమయంలో వైసీపీ సామాజిక బస్సుయాత్రలో మహానీయుల ఫోటోలు ఎక్కడున్నాయని బాలయ్య ప్రశ్నించారు.

ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన బాలకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. అందువల్ల... ప్రజాస్వామ్య సంరక్షణకు అందరూ కలిసి పోరాటం చేయాలని అన్నారు. ఇదే సమయంలో... రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదని.. హిందూపురంలో తన సొంత నిధులు, పార్టీ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు!

Tags:    

Similar News