బాలినేని వెళ్లిపోతున్నారా? ఫ్యాన్ వదిలేసి గాజు గ్లాస్ పట్టుకోనున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా.. బంధువుగా పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా?

Update: 2024-09-13 03:45 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా.. బంధువుగా పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గడిచిన కొద్దికాలంగా పార్టీ పట్ల.. పార్టీ తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతారు. దీనికి తోడు.. ఎన్నికల్లో ఓటమి ఆయన ధోరణిని మార్చినట్లుగా చెబుతున్నారు. గతంలోనే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అవేమీ వాస్తవరూపం దాల్చలేదు. అయితే.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పగా.. తాజాగా ఆ జాబితాలో బాలినేని చేరనున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అధష్ఠానంపై గుర్రుగా ఉన్న బాలినేని.. ఇటీవల జిల్లాలో పార్టీ పదవులతో పాటు మరిన్నిఅంశాలపైనా అలకబూనినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు దూరాన్ని తగ్గించేందుకు బాలినేనిని జగన్ పిలిచి మాట్లడారు. అయినప్పటికీ దూరం తగ్గలేదంటున్నారు.

రానున్న ఒకట్రెండు రోజుల్లో వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన చేస్తారని చెబుతున్నారు. మరి.. ఆయన తర్వాతి మజిలీ ఎక్కడికి అన్న విషయంపైనా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట్నించి చంద్రబాబు.. టీడీపీ అంటే ఒక పట్టాన నచ్చని బాలినేని.. తాజాగా మాత్రం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనకు వెళ్లనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వంద శాతం స్ట్రైకింగ్ రేటుతో చెలరేగిపోయిన పవన్ తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వైసీపీ మీద ఒంటికాలి మీద ఎగిరిన సమయంలోనూ.. వైసీపీలో బాలినేని లాంటి మంచోళ్లు ఉంటారని జనసేన అదినేత పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. వైసీపీ అధినేత తీరును అదే పనిగా విమర్శించే పవన్ కల్యాణ్.. ఆ పార్టీలోనూ మంచినేతలకు కొదవ లేదంటూ వ్యాఖ్యానించేవారు. తన మీద అంత మంచి అభిప్రాయం ఉన్న పవన్ చెంతకు బాలినేని చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒక రోజు అటో ఇటో అవుతుందేమో కానీ.. చివరకు వెళ్లేది మాత్రం జనసేనలోకే అన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News