పోటీచేసే స్థానంపై బాలినేని క్లారిటీ... కేసులపై కీలక వ్యాఖ్యలు!
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంతో పాటు ఒంగోలు ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేసేది మొదలైన విషయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు
వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంతో పాటు ఒంగోలు ఎంపీ స్థానానికి ఎవరు పోటీ చేసేది మొదలైన విషయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, తన అభిమానులకు ఆయన కొన్ని సూచనలు చేశారు.
అవును... వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడనుంచి పోటీ చేసేది చెప్పారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇందులో భాగంగా.. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎంపీ సీటుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. తాము పోటీ చేయడంపై వస్తోన్న ప్రచారాలను ఎవ్వరూ నమ్మొద్దని కోరారు.
ఇదే సమయంలో తాను వైసీపీని వీడుతున్నట్లు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి... వాటిని వైసీపీ శ్రేణులు, తన అభిమానులు పట్టించుకోవద్దని, తాను వైసీపీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ సందర్భంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు మాట్లాడిన ఆయన... యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని ఆరోపించారు. కోర్టులో కేసులు వేశాడనే వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని బాలినేని ప్రకటించారు.
ఈ క్రమంలో వచ్చే నెలలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని బాలినేని శ్రీనివాస్ చెప్పారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పంపిణీలో తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతుంటే టీడీపీకి కోర్టులో కేసులు వేయడం ఏం పని అని ప్రశ్నించారు.