బందరు ఎంపీ సీటు జనసేనదేనా...?
ఇదిలా ఉంటే బందరు ఎంపీ సీటుతో పాటు మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ సీట్లను కూడా జనసేన కోరుతుందని అంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో బందరు ఎంపీ సీటు కోసం జనసేన పట్టుబడుతోంది అని అంటున్నారు. ఈ జిల్లాలో రెండు సీట్లు ఉన్నాయి.ఒకటి విజయవాడ అయితే రెండవది బందరు అలియాస్ మచిలీపట్నం. విజయవాడ సీటు టీడీపీ తీసుకుని బందరు సీటు తమకు ఇవ్వాలని జనసేన కోరుతోందిట.
దానికి కారణం ఏంటి అంటే బందరు ఎంపీకి 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏకంగా ఒక లక్షా 13 వేల 292 ఓట్లు వచ్చాయి. అంతే కాదు బందరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపు ఓటర్ల ప్రభావం గట్టిగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం. పెడన, పెనమలూరు, గుడివాడ లలో కాపుల ఓట్లు అత్యంత కీలకంగా ఉన్నాయి.
దాంతో ఈ ఎంపీ సీటు తమకే పొత్తులో భాగంగా కేటాయించాలని జనసేన కోరుతోంది అని అంటున్నారు. మచిలీపట్నం నుంచి రెండు సార్లు ఎంపీగా బీసీ నేత కొనగళ్ళ నారాయణ ఉన్నారు. ఆయన 2009, 2014లలో గెలిచారు. 2019లో వైసీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఇక బీసీ అభ్యర్ధిగా కొనగళ్ళ నారాయణ గెలుస్తున్నా ఈ సీట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎంపీలుగా అయ్యారు.
సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వారే. ఇక ఆయనకు 2019 ఎన్నికల్లో అరవై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. జనసేనకు దానికి మించి రెట్టింపు ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈసారి పొత్తు ఉంటే కనుక కచ్చితంగా జనసేన గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
జనసేన నుంచి బందరు ఎంపీ సీటు మీద బిగ్ షాట్స్ కన్నేశారని అంటున్నారు. ఇక మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే జనసేన గట్టిగా పట్టుబడితే మాత్రం ఆయనను ఈసారి అసెంబ్లీకి పంపించాలని కూడా చూస్తున్నారు. పెడన అసెంబ్లీ నియోజకవర్గానికి కొనగళ్ళని షిఫ్ట్ చేసి బందరు ఎంపీ సీటు జనసేనకు ఇచ్చే ఆలోచన కూడా టీడీపీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే బందరు ఎంపీ సీటుతో పాటు మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ సీట్లను కూడా జనసేన కోరుతుందని అంటున్నారు. ఈ సీట్లలో కచ్చితంగా తాము పోటీ చేస్తామని గెలిచి తీరుతామని అంటున్నారు. అయితే ఆయా సీట్లలో టీడీపీ నుంచి పెద్ద నాయకులు గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వారే పోటీకి ఉన్నారని అంటున్నారు.
అయితే జనసేన పట్టుబడితే ఈ రెండు సీట్లు కూడా ఇచ్చే అవకాశాలు టీడీపీకి ఉంటాయని అంటున్నారు. ఎంపీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో కనీసం రెండు చోట్ల అయినా తమ పార్టీ వారు పోటీ చేస్తే అది తమకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని తమ పట్టు కూడా పెరుగుతుందని జనసేన ఆలోచిస్తోందని అంటున్నారు. మరి జనసేన కోరుకున్న సీట్లు దక్కుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.