బంగ్లాదేశ్ లో విద్యార్థుల ప్రభుత్వం వస్తుందా ?
మరో వైపు చూస్తే విద్యార్థులు అంతా కలసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
బంగ్లాదేశ్ లో యువత ఇపుడు కదం తొక్కుతోంది. వారిలో ఉన్న ఆవేశం దేశంలో కొత్త మార్పులను కోరుకుంటోంది. నిజానికి యువతను ముందు పెట్టి అక్కడ రాజకీయ శక్తులు షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించేశాయి. వెర్రి ఆవేశంతో యువత అంతా బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇంటినే చుట్టుముట్టి చేయాల్సిన అరాచకం అంతా చేశారు.
అలా ప్రాణాలను చిక్కబెట్టుకుని బంగ్లాదేస్ ప్రధానిగా రాజీనామా చేసి మరీ భారత్ కి షేక్ హసీనా వచ్చారు. ఆమె చాలా కాలంగా భారత్ లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా తరువాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది. దానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం వహించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంతో జాప్యం చేస్తోంది.
పైగా వెనక నుంది కొన్ని శక్తులు ఈ ప్రభుత్వాన్ని ఆడిస్తున్నాయి అన్నది కూడా ఉంది. దాంతో యువత ఆవేశం కాస్తా మరో వైపు మళ్ళింది. విద్యార్థుల నుంచి పుట్టిన అగ్గి మంట షేక్ హసీనాను గద్దె నుంచి దించినట్లుగానే ఇపుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం అయితే సాగుతోంది. దాంతో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా వ్యతిరేక శక్తులకు విద్యార్ధి లోకం యువత ఆవేశం అర్ధం కావడం లేదు. మరో వైపు చూస్తే విద్యార్థులు అంతా కలసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇందుకోసం వారు జనంలోకి వెళ్ళి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని చూస్తున్నారు అలా లక్షలాది మంది ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని వారి ఆలోచనల మేరకే పార్టీ విధి విధానాలను రూపొందిస్తామని విద్యార్ధి నాయకులు చెబుతున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతామని అంటున్నారు. ఆప్నార్ చోఖే నాధున్ బంగ్లాదేశ్ పేరుతో విద్యార్థులు యువత జనంలోకి వెళ్ళి కొత్త పార్టీ విధానాల కోసం అభిప్రాయాలను సేకరించబోతున్నారు.
ఈ విధంగా తాము దేశ ప్రజలకు చేరువ అవుతామని వారితో అనుసంధానం అవుతామని జాతీయ పౌరుల కమిటీ తెలిపింది. దీని మీద విద్యార్ధి ఉద్యమ కో ఆర్డినేటర్ అయిన హస్నత్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ బంగ్లదేశ్ లో ఫాసిస్టు వ్యవస్థ మూలాలు అలాగే ఉన్నాయని అన్నారు. హసీనాను మాత్రమే తొలగించామని తప్పుడు వ్యవస్థ అలాగే కొనసాగుతోందని అన్నారు.
ఇక మీదట విద్యార్ధులు దేశ ప్రజలతో కలసి చేసేది తుది పోరాటమని ఆ విధంగా తుది విజయం దక్కుతుందని అన్నారు. అంటే రాజకీయ పార్టీని పెట్టి గద్దెనెక్కాలన్నది విద్యార్ధుల యువత ఆలోచనగా ఉంది. ఇది తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న మహమ్మద్ యూనస్ కి అలాగే తెర వెనక శక్తులకు మింగుడుపడటం లేదు.
ఏకంగా ఫాసిస్టు వ్యవస్థ మీదనే పోరాటం అని విద్యార్థులు అంటున్నారు. కొత్త దేశాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. యువత అతి ముఖ్య పాత్ర ఈ ఉద్యమంలో పోషిస్తారు అని అంటున్నారు. దాంతో బంగ్లాదేశ్ రాజకీయాలు కీలకమైన మలుపు దిశగా సాగనున్నాయి.
ఇక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో సరిగ్గా పనిచేయడం లేదని యువత ఆగ్రహిస్తోంది. అలాగే ఎన్నికలు పెట్టకుండా మరింత కాలం కోన్సాగాలని చూస్తోంది. దీంతోనే యువత విద్యార్ధుల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఏకంగా రాజకీయ పార్టీ స్థాపన దిశగా వారిని పురికొల్పాయి.
మరి రానున్న రోజులలో విద్యార్ధులు యువత కలసి పార్టీని పెడితే అది ఎలా ఉంటుంది. దానికి బలమైన సైనిక శక్తి మద్దతు ఉంటుందా లేక కొత్త రాజకీయానికి జనం మద్దతు ఎంత వరకూ ఉంటుంది అసలు యువతను రాజకీయాల్లోకి ఇంత దూకుడుగా అక్కడ వ్యవస్థీకృతమైన ఉన్న రాజకీయం రానిస్తుందా అన్నవి కీలక ప్రశ్నలు వీటికి జవాబు కాలమే చెబుతుంది.