లంకలోలాగే.. అధ్యక్షురాలి బెడ్ పై నిరసన.. బంగ్లా సారథిగా ప్రొఫెసర్
బంగ్లాదేశ్ ను 15 ఏళ్లుగా నిరవధికంగా పాలిస్తున్న అవామీ లీగ్ అధినేత షేక్ హసీనాపై ఇటీవల అక్కడి రిజర్వేషన్ల నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది.
మితిమీరిన సంక్షేమ పథకాలతో.. రెండేళ్ల కిందట పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంక ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది.. కేవలం ఇదే కారణం కాకున్నా అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స్ కుటుంబ అవినీతి.. బంధుప్రీతి.. అనేక పాలనా వైఫల్యాలతో లంక ప్రజలు విసుగెత్తిపోయారు. వీధుల్లోకి వచ్చారు.. చివరకు ఏకంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. అందులోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. అందినకాడికి దోచుకున్నారు.. చివరకు రాజపక్స పడక గదిలోకీ వెళ్లారు.. తాము చేయాలనుకున్నదంతా చేసేసి వెళ్లిపోయారు. అయితే, తనపై ఉన్న ఈ తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన రాజపక్స అంతకుముందే దేశం విడిచిపారిపోయారు. ఇప్పుడు అచ్చం అలాగే బంగ్లాదేశ్ లోనూ జరుగుతోంది.
హసీనా.. నువ్వు మా కొద్దు
బంగ్లాదేశ్ ను 15 ఏళ్లుగా నిరవధికంగా పాలిస్తున్న అవామీ లీగ్ అధినేత షేక్ హసీనాపై ఇటీవల అక్కడి రిజర్వేషన్ల నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారికి 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనడం యువతలో తీవ్ర కల్లోలం రేపింది. అసలే ఉద్యోగాలు లేని తమకు ఈ నిర్ణయం శరాఘాతమేనని వారు నమ్మారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఇవి హింసాత్మకంగా మారడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించాలని చెప్పింది. అయినా హసీనా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం మరోసారి అల్లర్లు చెలరేగాయి. దీంతో సోమవారం ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయారు.
బంగ్లాలోకి చొరబడి..
ఏ దేశంలోనైనా అధినాయకుల నివాసాలు బంగ్లాలుగానే ఉంటాయి. పెద్దపెద్ద విస్తీర్ణంలో ఉండే వీటిపై సామాన్యులకు ఆసక్తిగా ఉంటుంది. కాగా, బంగ్లా రాజధాని ఢాకాలో హసీనా ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు ఆమె పడక గదిలోకీ వెళ్లారు. కొందరు ఆమె నిద్రించే బెడ్ ఇదే అంటూ ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు..హసీనా ఇంట్లోని చీరలు, పాత్రలను దొంగలించారు. వంటగదిలోకి చొరబడి ఆహారాన్ని తినేశారు. ఈ వీడియోలను షేర్ చేశారు.
కాబోయే ప్రధాని ఆయనేనా?
హసీనా స్థానంలో బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని ఎవరనే ప్రశ్న నెలకొంది. దీనికి తాత్కాలిక ప్రభుత్వ సారథిగా రచయిత, ప్రొఫెసర్ సలీముల్లా ఖాన్ పేరు వినిపిస్తోంది. ఆర్మీ చీఫ్ తో పాల్గొన్న సమావేశంలో కీలక నాయకులు సమావేశమై ఆయన పేరుకు మొగ్గు చూపినట్లు సమాచారం. కాగా, బంగ్లా ప్రతిపక్ష నేత బేగం ఖలీదా జియా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. వీరిద్దరే రెండు దశాబ్దాలకు పైగా బంగ్లాను పాలిస్తున్నారు. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత పురుష నాయకుడు రాబోతున్నారు.