ఇదెక్కడి ట్విస్ట్.. ఆయనకు కమల ఇష్టం లేదట!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ బరిలోకి దిగారు. అయితే ఆయన వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు రావడంతో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. జో బైడెన్ తో పోలిస్తే డోనాల్డ్ ట్రంప్ కు కమలా హ్యారిస్ అయితే గట్టి పోటీ ఇవ్వగలరని పలు సర్వేలు సైతం పేర్కొన్నాయి. కొన్ని సర్వేల్లో ట్రంప్ కంటే కమల స్వల్ప ఆధిక్యంలో నిలవడం విశేషం.
డెమోక్రటిక్ పార్టీలో అత్యధికులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం కమలా హ్యారిస్ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన డెమోక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా ట్విస్టు ఇచ్చారు.
కమల అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఒబామా సుముఖంగా లేరని తెలుస్తోంది. డెమోక్రటిక్ పార్టీ నేతలంతా ఆమెకు మద్దతు తెలుపుతున్నా ఇంతవరకు ఒబామా మాత్రం ఆమెకు మద్దతుగా మాట్లాడకపోవడం గమనార్హం.
కమల అధ్యక్ష అభ్యర్థిత్వంపై బరాక్ ఒబామా అంత సుముఖంగా లేరని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పకపోయినా విశ్వసనీయ వర్గాలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ట్రంప్ పై గెలిచే సామర్థ్యం కమలా హ్యారిస్ కు లేదని ఒబామా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆమె అభ్యర్ఙిత్వానికి ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. కమలా హ్యారిస్ స్థానంలో అరిజోనా సెనేటర్ గా ఉన్న మార్క్ కెల్లీ అయితే ట్రంప్ కు గట్టిపోటీ ఇవ్వగలరని ఒబామా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు దేశ సరిహద్దులకు కూడా వెళ్లని కమలా హ్యారిస్ వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడటంపై ఒబామా పెదవి విరుస్తున్నారని సమాచారం. సవాళ్లను, సమస్యలను అధిగమించి ఆమె గెలుపొందడం కష్టం కాబట్టే కమల వైపు ఆయన మొగ్గు చూపడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమలను అభ్యర్థిగా నిర్ణయిస్తూ డెమోక్రటిక్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఒబామా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ జాతీయ సదస్సులో చెప్పే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
కేవలం కమల విషయంలోనే కాకుండా జోబైడెన్ విషయంలోనూ ఒబామా తన సన్నిహితులు, మిత్రుల దగ్గర పెదవి విరిచినట్టు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
కాగా డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలంటే మొత్తం 4,800 మంది డెలిగేట్లలో 1,976 మంది మద్దతు అవసరం. అయితే కమలకు ఇప్పటికే 2500 మందికి పైగా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది.