బావ, బామ్మర్ది కొత్త రూటు గమ్యం చేరుస్తుందా?
ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సృష్టించాలని కలలు కన్న బీఆర్‌ఎస్ కు దిమ్మ తిరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు.. పార్టీని గెలిపించడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగినా విజయం సాధించపెట్టలేకపోయారు.
ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బావ (హరీశ్ రావు), బామ్మర్ది కేటీఆర్ రూటు మార్చారు. పార్లమెంటు ఎన్నికల్లో అయినా మంచి ఫలితాలు సాధించాలని వీరిద్దరూ ఆశిస్తున్నారు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు వీళ్లిద్దరు మాత్రమే కావడంతో ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను గెలిపించాల్సిన బాధ్యతంతా కేటీఆర్, హరీశ్ రావులపైనే పడింది.
ఇందుకు తగ్గట్టే బావ, బామ్మర్ది తమ రూటు మార్చారు. ఇందులో భాగంగా కొత్త సంవత్సరం నాడు కేటీఆర్ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమున్నా తన దగ్గరకు రావాలని సూచించారు. వారితో సెల్ఫీలు దిగారు.
మరోవైపు హరీశ్ రావు మెట్రో రైలును ఎంచుకున్నారు. ఎల్బీ నగర్ నుంచి లక్డీకాపూల్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన ప్రయాణించారు. ప్రయాణికులతో మాట కలిపారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
అలాగే తన నియోజకవర్గమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డ్ లో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి దగ్గర ఆగి హరీశ్ రావు అక్కడ ముచ్చట పెట్టారు. ఇడ్లీలు తిని అక్కడ టిఫిన్ చేస్తున్న యువకులతో మాటామంతీ నిర్వహించారు.
సోషల్ మీడియా వేదికగా, ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేటీఆర్, హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇలా ఓవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే.. ఇంకోవైపు ప్రజల వద్దకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్, హరీశ్ రావు ఎంచుకున్న కొత్త రూటు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు విజయం సాధించపెట్టడానికి వీరిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేదా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.