జర జాగ్రత్త.. కేసులు పెరుగుతున్నాయి.. దేశంలో అన్ని.. తెలంగాణలో ఇన్ని
తాజాగా కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 కారణంగా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి.
మహమ్మారి కరోనా విధ్వంసం తర్వాత.. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కొత్త వేరియంట్ రావటం.. దాంతో ఆలజడి మొదలుకావటం తెలిసిందే. తాజాగా కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 కారణంగా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి. అయితే.. దీనిపై మొన్నటి వరకు సీరియస్ గా లేని మన దేశం ఇప్పుడు ఒక్కసారిగా అలెర్టుఅయ్యింది. చలి తీవ్రత ఎక్కువ కావటం.. పశ్చిమ దేశాల్లో సెలవుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు జోరుగా సాగే అవకాశం ఉండటంతో పాటు.. వివిధ దేశాల్లో జేఎన్1 వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళలో.. కేంద్రంలోని మోడీ సర్కార్ అలెర్టు అయ్యింది.
దేశంలో పెరుగుతున్న కేసుల మీద ఫోకస్ చేయటంతో పాటు.. రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాల్నివిడుదల చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గడిచిన మూడు రోజుల్లో దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 614 కొత్త కేసులు నమోదైనట్లుగా కేంద్రం వెల్లడించింది. మే 21 తర్వాత దేశంలో ఒక్క రోజులో ఇంతలా కొత్త కేసులు నమోదుకావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో కేరళలో ముగ్గురు కొవిడ్ తో కన్నుమూసినట్లుగా సమాచారం వెలువడింది.
కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో 92 శాతం మంది ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని.. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2311కు పెరిగినట్లుగా వెల్లడించారు. కేరళ.. మహారాష్ట్ర.. జార్ఖండ్.. కర్ణాటకలో రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆసుపత్రుల్లోచికిత్స సన్నద్దతను పెంచినట్లుగా తెలిపారు. కొత్త రకం వేరియంట్ గా భావించే అనుమానిత కేసుల శాంపిళ్లను వెంటనే ఇన్సాకాగ్ జన్యుక్రమ విశ్లేషణకు ల్యాబ్ లకు పంపాలన్న ఆదేశాలు జారీ చేశారు.
కొత్త వేరియంట్ వ్యాప్తి వేగం మన దేశంలో తక్కువగా ఉంటుందని.. దీంతో వచ్చే రిస్క్ కూడా తక్కువేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కొత్త వేరియంట్ అమెరికా.. చైనా.. సింగపూర్.. భారత్ లలో వెలుగు చూడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజులో ఆరు కేసులు కొత్తగా నమోదైనట్లుగా వెల్లడైంది. మంగళవారం నాలుగు కేసులు నమోదు కాగా.. బుధవారానికి ఈ కేసుల సంఖ్య కాస్త పెరుగుదల చోటు చేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీకేఆర్ ఫుల్.