రాజకీయాలు కాదు దేశం కోసమేనట.. వినితీరాలి బ్రో!
సువిశాల భారత దేశం కోసం తామంతా ఐక్యంగా నిలుస్తామని ఖర్గే చెప్పుకొచ్చారు. మరి రాజకీయం కోసం కలుస్తున్నామని చెప్పిన మాట ఏమైందనేది ఇప్పుడు ప్రశ్న.
కేంద్రం లోని నరేంద్ర మోడీ సర్కారు ను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు జతకట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు నిన్న మొన్నటి వరకు ప్రకటించారు కూడా! అంతేకాదు.. విపక్షాల తొలి భేటీని గత నెల లో బిహార్ రాజధాని పాట్నాలోనూ నిర్వహించారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 'మాట' మార్చేశారు. తాము కూటమి కట్టింది.. కేవలం రాజకీయాల కోసం కాదన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపి పనిచేయడం ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమాన్ని వేగవంతం చేయడమే లక్ష్యమ ని కాంగ్రెస్ ప్రకటించింది.
తాజాగా బెంగళూరు వేదికగా విపక్షాల నేతలు భేటీ అయ్యారు. మొత్తం 26 పార్టీల కు చెందిన 53 మంది కీలక నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం వరకు నాయకులు వస్తూనే ఉన్నారు.(కాదు.. కాదు.. రావాలా.. వద్దా అనే మీమాంసతోనే సమయం గడిపేశారనే టాక్ ఉంది) అయితే.. మరోవైపు తమిళనాడు లో ఈడీ దాడులు చేయడం.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో.. తమతో చేతులు కలిపిన పార్టీలు ఎప్పుడు జారిపోతాయో.. అని అనుకున్న కాంగ్రెస్ పార్టీ(ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోంది) వెంటనే మాట మార్చిందనే టాక్ వినిపిస్తోంది.
"మనకూటమి కేవలం రాజకీయాల కోసమే కాదు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమాన్ని మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తాం" అని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం గమనార్హం. ''యునైటెడ్ ఉయ్ స్టాండ్ ఫర్ దిస్ ఇండియా''(భారత దేశ ఐక్యతకు నడుం బిగిస్తున్నాం) అనే నినాదంతో బెంగళూరు లోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో ఈ భేటీ ని నిర్వహించారు. సువిశాల భారత దేశం కోసం తామంతా ఐక్యంగా నిలుస్తామని ఖర్గే చెప్పుకొచ్చారు. మరి రాజకీయం కోసం కలుస్తున్నామని చెప్పిన మాట ఏమైందనేది ఇప్పుడు ప్రశ్న.
ఎవరెవరు వచ్చారు?
బెంగళూరుభేటీకి మొత్తంగా 26 పార్టీల కు చెందిన ముఖ్య నాయకులు వచ్చారు. వీరి లో ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(జేఎంఎం)
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (డీఎంకే)
బీహార్ సీఎం నితీష్ కుమార్ (జేడీయూ)
లాలూప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అధినేత
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (ఎస్పీ)
మెహబూబా ముఫ్తీ (పీడీపీ)
ఫరూక్ అబ్దుల్లా (ఎన్‌సీ)
జయంత్ చౌదరి (ఆర్ఎల్‌డీ)
డి.రాజా (సీపీఐ)
సీతారాం ఏచూరి (సీపీఎం)