మీ ఆఫీసులో చెబుతా ఏమనుకుంటున్నారో... టెకీలకు పోలీసులు షాక్!

అవును... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు పడటం తెలిసిందే. మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమూ తెలిసిందే

Update: 2023-12-17 14:30 GMT

ఎవరైనా చిన్నతనంలో తప్పు చేస్తూ కనిపిస్తే... మీ ఇంట్లో పేరెంట్స్ కి చెబుతాం అని అనేటోళ్లు! ఇంట్లో పిల్లలు మాట వినకపోతే... స్కూల్లో టీచర్ కి చెబుతాం అని చెబుతుంటారు! పూర్తిగా అలా అని చెప్పలేం కానీ తాజాగా ట్రాఫిక్ పోలీసులు కూడా దాదాపు అలాంటి పనికే పూనుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తాజాగా బెంగళూరు పోలీసులు తీసుకున్న నిర్ణయం!

అవును... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు పడటం తెలిసిందే. మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమూ తెలిసిందే. అయితే అంతకుమించి అంటున్నారు బెంగళూరు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బైక్ పై దూసుకునివెళ్తే... ఇకపై సహించేది లేదంటున్నారు. ఈ సమయంలో టెకీల దూకుడుకు ముకుతాడు వేసేందుకు అంటూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటించని పక్షంలో ఆ విషయాన్ని నేరుగా ఉద్యోగి పనిచేసే కంపెనీకే తెలియజేస్తామంటున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కొత్త డ్రైవ్‌ ను చేపట్టారు బెంగళూరు ఈస్ట్ డివిజన్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ప్రధానంగా ఐటీ కారిడార్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డులో పైలట్‌ ప్రాజెక్ట్‌ గా దీన్ని చేపట్టనున్నారు. సపోజ్ ఈ ప్రాజెక్ట్‌ సక్సెస్ అయితే మాత్రం బెంగళూరులోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఈస్ట్ బెంగళూరులోనే ఈ డ్రైవ్‌ ను చేపట్టడానికి గల కారణాన్నీ పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు త్వరత్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం కోసం తరచూ ట్రాఫిక్‌ రూల్స్ ని అతిక్రమిస్తున్నారంట. ఈ విషయాన్ని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో వీరి దూకుడుకు చెక్ పెట్టడమే తక్షణ కర్తవ్యంగా భావించారని అంటున్నారు.

అందువల్ల ఇకపై ఎవరైనా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే.. ఐడీ కార్డు ఆధారంగా సంబంధిత సమాచారాన్ని సదరు వ్యక్తి పనిచేసే కంపెనీకి ఇ-మెయిల్‌, వాట్సప్‌ ద్వారా తెలియజేస్తామని బెంగళూరు ఈస్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News