"విశ్వాసం సన్నగిల్లింది"... కీలక సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం!

గత ఏడాది అక్టోబర్ 8వ తేదీ తర్వాత నుంచి ఇజ్రాయెల్ సైన్యం అవిరామంగా పోరాడుతూనే ఉందని చెప్పొచ్చు.

Update: 2024-11-06 03:54 GMT

గత ఏడాది అక్టోబర్ 8వ తేదీ తర్వాత నుంచి ఇజ్రాయెల్ సైన్యం అవిరామంగా పోరాడుతూనే ఉందని చెప్పొచ్చు. ఒకేసారి రెండు మూడు వైపుల నుంచి సమస్యలు ఎదురవుతున్నా వాటిని సమర్ధవంతగా తిప్పికొడుతోంది. ఈ సమయంలో ఆ దేశ రక్షణశాఖ మంత్రి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు.

అవును... గాజాలో హమాస్ తో అవిరామంగా సాగుతున్న పోరు.. మరో పక్క తామూ ఉన్నామంటూ ఎంటరైన హెజ్ బొల్లాపై లెబనాన్ లో పోరు కొనసాగుతోన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఆ దేశ రక్షణమంత్రి యోవ్ గాలంట్ ను పదవి నుంచి తొలగించారు.

వాస్తవానికి గాజాలో యుద్ధం మొదలైన తర్వాత బెతన్యాహు – గాలంట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని అంటారు. అయితే ఈ విషయంలో ఇంతకాలం సౌండ్ లేకుండా ఉన్నట్లు కనిపించిన నెతన్యాహు... ఒక్కసారిగా మంగళవారం అర్ధరాత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ స్థానంలో తనకు విశ్వాసపాత్రుడు అయిన ఇజ్రయెల్ కాట్జ్ ను నియమించనున్నారు!

ఈ విషయాలపై స్పందించిన నెతన్యాహు... యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణ శాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం ఉండటం ఎంతో అవసరమని.. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేదని.. అయితే, దురదృష్టవసాత్తు ఇప్పుడు అది కరువైందని.. విశ్వాసం సన్నగిల్లిందని.. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయని ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే... నెతన్యాహు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది అనేది వేచి చూడాలి. అందుకు ఓ బలమైన కారణం ఉంది. గత ఏడాదిలో కూడా గాలంట్ ను తొలగించేందుకు ప్రయత్నం జరగ్గా... నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. వేలమంది వీధుల్లోకి వచ్చారు.

ఈ నేపథ్యంలో నెతన్యాహు తాజా నిర్ణయం పట్ల ఇజ్రాయెల్ ప్రజలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. మరోపక్క... గాలంట్ స్థానంలో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ను నియమించనుండగా.. ఈ శాఖను గిడియాన్ సార్ కు అప్పగించారు!

Tags:    

Similar News