ఆయన సలహాతోనే దుబాయ్ వెళ్లిపోయా... సీఎంపై యాప్ ఓనర్ షాకింగ్ స్టేట్ మెంట్!
ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఛత్తీస్ గఢ్ లో కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కీలక సమయంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో రచ్చ రచ్చగా మారింది.
ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఛత్తీస్ గఢ్ లో కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కీలక సమయంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో రచ్చ రచ్చగా మారింది. ఈ క్రమంలో మహాదేవ్ బుక్ సహా 22 బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్ లపై కేంద్రం కొరడా ఝళిపించింది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పై ఆ బెట్టింగ్ యాప్ యజమాని శుభమ్ సోని సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు.
అవును... మహాదేవ్ బుక్ సహా 22 బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్ లపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఇందులో భాగంగా.. అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నందున ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు మొత్తం 22 యాప్ లు, వెబ్ సైట్ లను నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే.. ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ పై మహాదేవ్ యాప్ ఓనర్ సంచలన ఆరోపణలు చేసిన రోజునే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం. తాజాగా వచ్చిన మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసిన నిందితుడు శుభమ్ సోనీ.. దుబాయ్ నుంచి ఒక వీడియోను విడుదల చేసి.. అందులో అతను భూపేశ్ బఘేల్ పై తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఇందులో భాగంగా... అసలు ఈ యాప్ కి అసలు యజమాని ఆయనే అని అన్నాడు.
ఈ మేరకు వీడియో లో స్పందించిన శుభమ్ సోనీ... బెట్టింగ్ యాప్ ను రూపొందించేందుకు సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించారని.. బెట్టింగ్ యాప్ నకు అసలైన ఓనర్ ఆయనేనని.. భిలాయ్ లో తన సహచరులు అరెస్టు అయినప్పుడు సీఎం తనని దుబాయ్ కి పారిపోవాలని సలహా ఇచ్చారని.. సంచలన ఆరోపణలు చేశాడు. అయితే... ఈ ఆరోపణలను సీఎం తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణించారు.
దీంతో కేంద్రం మరింత సీరియస్ గా ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వంపై రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చట్టవిరుద్ధమైన యాప్, వెబ్ సైట్ లను చాలా కాలం కిందటే మూసివేసి ఉండాల్సిందని.. అయినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదని కేంద్రం ఆరోపించింది. ఈ సందర్భంగా కేంద్రం సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా... ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి సెక్షన్ 69ఏ ఐటీ చట్టం ప్రకారం వెబ్ సైట్ లేదా యాప్ ను నిషేధించేందుకు సిఫార్సు చేసే అధికారం ఉందని.. అయితే, వారు అలా చేయలేదని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదే సమయంలో... కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమారు ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటువంటి అభ్యర్థన రాలేదని రాజీవ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత చర్చనీయాంశం అయ్యింది.
కాగా... ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి సీఎం భూపేశ్ బఘేల్ కు రూ.500 కోట్ల అందాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఛత్తీస్ గఢ్ సీఎం... దుబాయ్ తో మీకున్న ఒప్పందం ఏమిటీ.. ఇంతవరకూ ఎవరినీ ఎందుకు అరెస్టులు చేయలేదు.. అసలు యాప్ ని ఎందుకు నిషేధించలేదు అని ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన నెక్స్ట్ డే నే కేంద్రం ఇలాంటి చర్యకు ఉపక్రమించడం గమనార్హం.