116 మంది ప్రాణాలు తీసిన భోలే బాబా బ్యాక్ గ్రౌండ్ ఇదేనట!

ఇటీవల కాలంలో తొక్కిసలాట చోటు చేసుకొని భారీగా మరణాలు చోటు చేసుకున్న ఉదంతం ఇదే. దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన ఈ దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.

Update: 2024-07-03 04:57 GMT

ఇటీవల కాలంలో తొక్కిసలాట చోటు చేసుకొని భారీగా మరణాలు చోటు చేసుకున్న ఉదంతం ఇదే. దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన ఈ దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఈ ఘోర ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసిన ఉదంతం నేపథ్యంలో ఎవరీ భోలే బాబా అన్నది ప్రశ్నగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ మహావిషాదానికి కారణం.. నిర్వాహకుల నిర్వాహణ లోపంగా చెప్పాలి. అయితే.. ఈ అధ్యాత్మిక కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరవుతారన్న సమాచారాన్నినిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేదు? అందుకు తగ్గట్లు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది మరో ప్రశ్న.

కడపటి వార్తల ప్రకారం తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోతే.. మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణాలు మరిన్ని నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్ర గాయాలతో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు.. ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందేలా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయటంతో పాటు.. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తుండటం తెలిసిందే. మరణించిన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి.

స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా పుల్రాయ్ గ్రామంలో శివారాధన జరగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 20వేల మంది హాజరవుతారు. ఇంత భారీగా భక్తులు వస్తున్నప్పుడు.. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే.. కార్యక్రమం జరిగిన టెంట్ లోపల నిర్వాహకులు తమ సొంత ఏర్పాట్లు చేస్తే.. టెంట్ బయట స్థానిక పోలీసుల భద్రత కల్పించారు.

దాదాపు గంటన్నర పాటు సాగిన ఆధ్యాత్మిక బోధ అనంతరం తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి ప్రధాన కారణం.. నిర్వాహకుల అతి మాత్రమేనని చెప్పాలి. తమ గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులు వెళ్లకుండా అట్టి పెట్టారు. అదే సమయంలో కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో భక్తులు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా బయలుదేరారు. వీరిని ముందుకు కదలకుండా ఆపటం.. ఒత్తిడి ఎక్కువై.. వెనుకున్న భక్తులు ముందుకు తోయటం.. ఆ గందరగోళంలో ఒకరి మీద ఒకరు పడటం.. అది కాస్తా తీవ్ర తొక్కిసలాటకు కారణమై వందకు పైగా ప్రాణాలు పోయిన దుస్థితి. దీనికి తోడు వాహనం దగ్గరకు వెళుతున్న బాబా ఆశీస్సులకు ప్రయత్నం చేయటం.. ఆయన అడుగు వేసిన చోటి మట్టిని సేకరించాలన్న తపన తొక్కిసలాటకు కారణంగా చెబుతున్నారు.

ఇంతకీ ఈ భోలే బాబా ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? పూర్వ రంగంలో అతడేం చేశాడు? లాంటి అంశాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. భోలే బాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి ఉరఫ్ నారాయణ్ హరి యూపీలోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో పుట్టారు. అక్కడే చదువుకున్న అతను కాలేజీ చదవులు పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశాడు.

బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. పాతికేళ్ల క్రితం ఉద్యోగం వదిలేసిన అతను ఆధ్యాత్మిక బాట పట్టినట్లుగా ప్రచారం చేుసకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని చెప్పే ఇతడు.. సమాజహితం కోసమే తానీ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెబుతాడు. భోలే బాబాకు వివిధ రాష్ట్రాల్లో బోలెడంతమంది భక్తులు ఉన్నారు.వారు నిర్వహించే కార్యక్రమాలకు భారీగా వాలంటీర్లు పాల్గొంటారు.

ఆయన మీద నమ్మకం ఎంత? అన్న దానికి కొవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లోనూ అతడు నిర్వహించే కార్యక్రమాలకు భారీగా భక్తులు హాజరయ్యేవారు. దీనిపై అప్పట్లో ఆందోళన వ్యక్తమయ్యేది. జాబ్ వదిలేసిన తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లారు. తాజా తొక్కిసలాట అనంతరం బాబా కనిపించకుండా పోయారు. దాదాపు 80 వేల మంది భక్తులు హాజరవుతారన్న అంచనా ఉన్నప్పటికీ.. అంతకు మించి భక్తులు హాజరు కావటం.. దీనికి తగిన సదుపాయాలు కల్పించకపోవటం ఈ ఘోరానికి కారణంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News