రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణి ఎక్కడ ఉంటున్నారు?
ఒక కుదుపు జీవితాన్ని మొత్తం మార్చేస్తాదని చెబుతుంటారు. మరికొంతమందికి వారి జీవన శైలిని మార్చేస్తాదని అంటుంటారు.
ఒక కుదుపు జీవితాన్ని మొత్తం మార్చేస్తాదని చెబుతుంటారు. మరికొంతమందికి వారి జీవన శైలిని మార్చేస్తాదని అంటుంటారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు అనంతరం... ఆయన కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు ఈ కోవలోకే వస్తాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో లోకేష్ కాకుండా... చంద్రబాబు మిగిలిన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇప్పుడు చర్చనీయ్యాంశం అయ్యింది.
అవును... టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉండటంతో ఆయన కుటుంబసభ్యులూ అక్కడికి సమీపంలోనే బస చేస్తున్నారు. చంద్రబాబుకు మూడుపూటలా ఆహారం, అవసరమైన మందులు సమకూర్చడంతోపాటు న్యాయపరమైన చిక్కుల నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో లోకేష్ బిజీగా ఉన్నారనేది తెలిసిన విషయమే.
ఇందులో భాగంగా... సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ లో ఓ ఇంటి ప్రాంగణంలో లోకేష్ బస చేస్తున్నారు. అక్కడే నిలిపిన యువగళం బస్సులోనే ఆయన ఉంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును కలవడానికి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లిన భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా చినబాబుతో పాటే యువగళం బస్సులోనే నివాసం ఉంటున్నారు!
ఇక కోర్టు అనుమతి మేరకు చంద్రబాబుకు జైల్లో కూడా ఇంటి నుంచి తెచ్చిన భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం అల్పాహారం, బ్లాక్ కాఫీ.. మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తో కూడిన భోజనం, వెజ్ కరీ.. సాయంత్రం పుల్కాలు వంటివి.. తాగేందుకు వేడినీళ్లు పంపిస్తున్నారు. యువగళం బస్సు పక్కనే ఉన్న ప్రత్యేక వ్యాన్ లో వండించి జైలులోకి పంపిస్తున్నారు.
మరోపక్క లోకేష్ ను పరామర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నాయకులు పెద్దఎత్తున రాజమండ్రి వస్తున్నారు. వీరితో కార్ వ్యాన్ సమీపంలోనే లోకేష్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పవన్ కల్యాణ్ రాజమండ్రి వెళ్లి లోకేష్ ను పరామర్శించిన అనంతరం జైల్లో చంద్రబాబుతో ములాకత్ అవుతారు.