ప్రవళిక ఆత్మహత్య ఇష్యూలో బిగ్ ట్విస్ట్!

హైదరాబాద్ లో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య తెలంగాణలో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-15 05:58 GMT

హైదరాబాద్ లో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య తెలంగాణలో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. రాహుల్ గాంధీ సైతం ఈ విషయంపై స్పందించారు. ఈ సమయంలో ఈ ఇష్యూలో ట్విస్ట్ తెరపైకి వచ్చింది!

అవును... అశోక్ నగర్ హాస్టల్ లో గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. ఇందులో భాగంగా... ఆమె ఆత్మహత్యకు టీఎస్పీఎసీ గ్రూప్ - 2 పరీక్ష వాయిదా కారణం కాదని, ప్రేమించిన యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమతున్నట్లు తెలియడం వల్లే అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఈ విషయంపై విలేఖరుల సమావేశంలో మరిన్ని వివరాలు వెల్లడించిన డీసీపీ... వరంగల్‌ జిల్లా నుంచి ప్రవళిక డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షల శిక్షణకు గతేడాది హైదరాబాద్‌ వచ్చిందని.. అశోక్‌ నగర్‌ లోని బాలికల హాస్టల్‌ లో చేరిందని తెలిపారు. ఆ హాస్టల్ లో ఒక రూం లో ప్రవళికతో పాటు అక్షయ, శ్రుతి, సంధ్య అనే మరో ముగ్గురు యువతులు ఉంటున్నారని అన్నారు.

ఈ క్రమంలో... తాజాగా శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మిగిలిన ముగ్గురు భోజనానికి వెళ్లగా.. ప్రవళిక ఒక్కరే గదిలో ఉందని తెలిపారు. మిగిలినవారు భోజనం ముగించుకొని వచ్చేసరికి గది తలుపు గడియపెట్టి ఉందని, లోపల ప్రవళిక ఉరివేసుకుని కనిపించిందని తెలిపారి. దీంతో వెంటనే చిక్కడపల్లి పోలీసులకు సమాచారమిచ్చారని డీసీపీ తెలిపారు.

అయితే ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి పోటీ పరీక్షల కోసం నగరానికి వచ్చిన శివరాం రాథోడ్‌ తో ప్రవళికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారని డీసీపీ వెల్లడించారు. అయితే.. తనకు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయ్యిందని శివరాం ఫోన్ లో ప్రవళికకు చెప్పగా... అది తట్టుకోలేక ఆమె ఈ పనికి పూనుకుందని చెబుతున్నారు.

ఈ సమయంలో... మృతురాలి గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌, ప్రేమలేఖ, సెల్‌ ఫోన్‌ దొరికయని చెప్పిన పోలీసులు... ఆ ఫోన్ లో చాటింగ్‌ లో కొంత డిలీట్ చేసి ఉందని, వాటిని రిట్రీవ్ చేస్తున్నామని అన్నారు. ఇదే క్రమంలో... హోటల్‌ సీసీ ఫుటేజ్‌.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపినట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం.. పరారీలో ఉన్న శివరాం రాథోడ్‌ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపిన ఆయన... అనుమానాస్పద మృతిగా ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News