17 రోజుల్లో 12: బిహార్ లో పేకమేడల్లా కూలుతున్న వంతెనలు
కేవలం మూడు వారాల కంటే తక్కువ సమయం.. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 17 రోజుల్లో బిహార్ లోని పన్నెండు వంతెనలు కూలిపోతున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది.
బిహార్ లో ఏం జరుగుతోంది? దేశంలో ప్రధానమంత్రి పదవికి అర్హుడుగా భావించే అధినేతల్లో నితీశ్ కుమార్ ఒకరు. అలాంటి ఆయన ఏలుబడిలో బిహార్ కొన్నేళ్లుగా తరిస్తోంది. అవినీతికి అస్కారం లేదని ఆయన గురించి చెబుతుంటారు. ఆ మాటకు వస్తే.. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఎంతో డెవలప్ మెంట్ ను తీసుకొచ్చారన్నప్రచారం జరిగింది. అలాంటి బిహార్ లో గడిచిన కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది?
కేవలం మూడు వారాల కంటే తక్కువ సమయం.. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 17 రోజుల్లో బిహార్ లోని పన్నెండు వంతెనలు కూలిపోతున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా కూలుతున్న వంతెనలతో సమాధానం చెప్పలేక నితీశ్ సర్కారు సతమతమవుతోంది. తాజా పరిణామాలతో బిహార్ రాష్ట్ర ఇమేజ్ మరింత డ్యామేజ్ కావటమే కాదు నితీశ్ సమర్థతపైనా.. ఆయన పాలన మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది బిహార్ ప్రభుత్వం. అదేమంటే.. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. నిర్వాహణ పనులను పర్యవేక్షించే అధికారుల కారణంగానే వంతెనలు కూలుతున్నట్లుగా చెబుతోంది. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్ని సరిగా నిర్వర్తించలేదని.. ఇంజినీర్లు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో వంతెనలు కూలుతున్నట్లుగా పేర్కొంది.
ఇటీవల కూలిపోయిన వంతెనలన్నీ కూడా దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించారని.. వాటి పునాదులు లోతుగా ఉండకపోవటం..తాజాగా ప్రభుత్వం చేపట్టిన పూడికతీత పనుల వేళ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో అన్ని వంతెనలు కూలుతున్నట్లుగా చెబుతున్నారు. వరుస పెట్టి కూలుతున్న వంతెనల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. నితీశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి నితీశ్ పెదవి విప్పటం లేదన్న ఆర్జేడీ.. "ఈ అవినీతి రహిత ప్రభుత్వానికి ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి ఎంతలా రాజ్యమేలుతుందో చెప్పటానికి ఈ ఘటనలే కారణం" అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. జూన్ 18 నుంచి ఇప్పటివరకు 12 వంతనెలు కూలిపోయినా సీఎం నితీశ్ ఒక్క ప్రకటన చేయలేదన్న విమర్శకు అక్కడి అధికార పక్షం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. పూడికతీత పనులు చేస్తున్నప్పుడు అజాగ్రత్తగా వ్యవహరించిన అధికారుల్ని.. కాంట్రాక్టర్లను బాధ్యుల్ని చేస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కూలిన వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని.. ఆ భారాన్ని పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల మీదనే బాధ్యత మోపుతామని పేర్కొన్నారు. మొత్తంగా పేకమేడల్లా కూలుతున్న వంతెనల ఇష్యూ మీద బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ నోరు విప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే.. కూలుతున్న వంతెనల మాదిరే ఆయన ఇమేజ్ సైతం కూలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.