కాంగ్రెస్ రూట్లోనే బీజేపీ..!?
కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేల జీతాలు వందశాతం పెంచింది.;
కర్ణాటకలో ఎమ్మెల్యేల జీతాలపై రచ్చ చేస్తున్న బీజేపీ నేతలకు కేంద్రంలోని కమలం నేతలు ఝలక్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యుల జీతాలు, ఇతర అలవెన్సులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటకలోని కాషాయ నేతలు ఇరకాటంలో పడిపోయారంటున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేల జీతాలు వందశాతం పెంచింది. ముఖ్యమంత్రి నెల జీతం రూ.లక్ష ఉంటే ఒకేసారి లక్ష చేసింది. దీనిపై అక్కడి ప్రతిపక్షం బీజేపీ మండిపడుతుండగా, కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎంపీల జీతం పెంచడంతో కర్ణాటక నేతలు ఆత్మరక్షణలో పడిపోయారంటున్నారు.
పార్లమెంటు సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సులు, పెన్షన్, అదనపు పెన్షన్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల జీతం రూ.లక్ష ఉండగా, దాన్ని ఏకంగా రూ.1.24 లక్షలకు పెంచింది. డైలీ అలవెన్సులు రూ.2 వేలు నుంచి రూ.2,500 చేసింది. ఇక మాజీ సభ్యుల పెన్షన్ ను నెలకు రూ.25 వేల నుంచి రూ.31 వేలు చేసింది. మాజీ సభ్యుల అదనపు పెన్షన్ కూడా రూ.2,500కు పెంచింది. ఈ మార్పు 2023 ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ప్రకటించింది.
అయితే కేంద్రం పెంచిన జీతాలు కర్ణాటకలో బీజేపీ నేతలకు షాకిచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే అక్కడి ఎమ్మెల్యేలకు పెంచి జీతాలపై బీజేపీ నేతలు పెద్ద పోరాటమే చేస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులకు దోచిపెడుతన్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ కొట్టిపడేస్తోంది. సాధారణ ప్రజలకు ఖర్చులు పెరిగినట్లే ఎమ్మెల్యేలకు ఖర్చులు ఉంటాయని చెప్పుకువస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమూ వేతనాలు పెంచడంతో బీజేపీ ఏం చెబుతుందని కాంగ్రెస్ నుంచి ఎదురు ప్రశ్నవచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి చడీచప్పుడు లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాప్రతినిధులకు ఆనందం పంచినా, కర్ణాటక కాషాయదళం మాత్రం ఎలా స్పందించాలో తెలియక బిక్కముఖం వేసిందంటున్నారు.