జగన్ ని బీజేపీ వాడుకుని వదిలేసిందా ?

ఇలా రాజకీయం మారిపోయినపుడు బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం మారకుండా ఎలా ఉంటారని జగన్ అనుకున్నారో అని అంటున్నారు.

Update: 2024-10-10 04:03 GMT

వైసీపీ అధినేత జగన్ ది ముక్కుసూటి రాజకీయం. ఆయన ఒకసారి ఒకరిని ద్వేషించారు అంటే మళ్లీ దగ్గరకు రానీయరు. ఆయన పాలిటిక్స్ కూడా అలాగే సాగుతుంది. కానీ రాజకీయాలు అలా లేవు. ఇక్కడ ప్రత్యర్ధులు ఎవరూ లేరు. శాశ్వత మిత్రులు శత్రువులు లేనిదే రాజకీయం అని అంటారు.

చంద్రబాబుకు రాజకీయంలోని సూత్రాలు బాగా తెలుసు. జగన్ అయితే వాటిని కాకుండా తనదైన పంధాలో సాగుతున్నారు అని అంటూంటారు. అయితే నిజాయతీగా ఉంటే జనాలు గుర్తిస్తారు అని ఆయన భావన. కానీ అయిదేళ్ల పాటు వైసీపీ పధకాలు అమలు చేసినా టీడీపీ వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పగానే లబ్దిదారులు అంతా అటు వైపు మళ్లారు.

వారి మాటేమిటి జగన్ స్వయంగా సృష్టించిన సచివాలయ వ్యవస్థలో పనిచేసే లక్షా పాతిక వేల మంది ఉద్యోగులలో నూటికి తొంబై అయిదు శాతం కూటమి వైపే తిరిగిపోయారు అని ప్రచారం సాగింది. ఇక వాలంటీర్లు కూడా పదివేలు ఇస్తామంటే అటే పనిచేశారు అన్న ప్రచారమూ సాగింది.

ఇలా రాజకీయం మారిపోయినపుడు బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం మారకుండా ఎలా ఉంటారని జగన్ అనుకున్నారో అని అంటున్నారు. బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు విడాకులు అన్నవి గత పాతిక ఏళ్ళుగా అలా సాగుతూనే వస్తున్నాయి. 1999లో పొత్తు పెట్టుకున్న టీడీపీ 2004లో ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీని దూరం పెట్టింది.

తిరిగి 2014లో బీజేపీని దగ్గరకు తీసుకుని పొత్తు అంది. 2019లో నో చెప్పేసింది. 2024లో మళ్లీ రెండు పార్టీలు కలిసాయి.ఈ విధంగా బీజేపీ టీడీపీ బంధం ఉంటే జగన్ మాత్రం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని భావించారని అంటారు.

దానికి కారణం 2019 నుంచి 2024 మధ్యలో బీజేపీ వైసీపీని అంతలా ప్రాధాన్యత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు రాజ్యసభలో తన బిల్లులు పాస్ కావడానికి వైసీపీని అలా వాడుకుందని కూడా ప్రచారం సాగింది. తీరా ఎన్నికలు వచ్చేసరికి తమ పొత్తు టీడీపీతో అని ఆ వైపు మళ్ళింది అని అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఆ సైడ్ నిలబడడం వల్లనే అన్ని రకాలైన మేనేజ్మెంట్ స్కిల్స్ తో టీడీపీ కూటమి గెలిచింది అన్నది వైసీపీకి ఉన్న అతి పెద్ద అనుమానంగా చెబుతారు.

ఇవన్నీ ఇలా ఉంటే మళ్లీ టీడీపీ బీజేపీల మధ్య చెడితే తానే ఆల్టర్నేషన్ గా కనిపిస్తాను అని వైసీపీ అధినాయకత్వం భావించి ఉండవచ్చు. కానీ ఇపుడు ఆ ప్లేస్ లోకి పవన్ వచ్చేశారు అని అంటున్నారు. ఆయనతో బీజేపీకి పొత్తు ఎప్పటికీ ఉంటుంది అని సంకేతాలు ఇస్తున్నారు. దాంతో ఏపీలో కూటమిలో లుకలుకలు వచ్చినా కేంద్రంతో టీడీపీ తలాక్ చెప్పినా వైసీపీకి మాత్రం రాజకీయంగా గతంలో ఉండే సీన్ అయితే లేదు.

దాంతో ఏపీలో వైసీపీ ఒంటరిగా మారింది అని అంటున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు ఇక మీదట కానీ ఫ్యూచర్ లో కానీ వైసీపీ వైపు చూసే అవకాశాలు లేవని ఎట్టకేలకు ఆలస్యంగానే ఆ పార్టీకి అర్ధం అయింది అని అంటున్నారు. దానికి శ్రీవారి లడ్డూల ఇష్యూ కూడా దోహదపడింది అని అంటున్నారు.

మొత్తానికి ఏపీలో వైసీపీని ఎలిమినేట్ చేయాలన్న టీడీపీ జనసేనల ప్లాన్ కి బీజేపీ ఫుల్ సపోర్టు ఇస్తోంది అన్నది బలపడిన తరువాతనే జగన్ ఇక బీజేపీతో తలాఖ్ చెప్పక తప్పదనే భావనకు వచ్చారా అనన్ చర్చ సాగుతోంది. రాజకీయాల్లో స్నేహాలు ఉండవని బంధాలు అంతకంటే ఉండవని వైసీపీ హై కమాండ్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత ఎక్కువగా వేగంగా మేలు జరుగుతుందని అంటున్నారు. సో ఇక మీదట వైసీపీ అడుగులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఆ పార్టీ అధినాయకత్వం మధనం మాత్రం రాజకీయంగా ఆలోచించాల్సిందే.

Tags:    

Similar News