బీజేపీ నేత కుమారుడు వెడ్స్ పాక్ అమ్మాయి... ఆన్ లైన్ లో 'నికాహ్'!
అయితే.. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ లోని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కి చెందిన ఓ నాయకుడి కుమారుడు.
ఇటీవల కాలంలో దేశాంతర వివాహాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కులం, మతం, ప్రాంతం వంటి ఆలోచనల్లో చాలా మంది ఉండగా.. మరికొంతమంది మాత్రం ఇతర దేశాల వ్యక్తులను వివాహాలు చేసుకుంటున్నారు. ప్రపంచాన్ని కుగ్రామం చేసే క్రమంలో తమ వంతు ప్రయత్నం వారు చేస్తున్నట్లున్నారు.
అయితే.. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్ లోని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కి చెందిన ఓ నాయకుడి కుమారుడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. అయితే... కొన్ని కీలక పరిస్థితుల కారణంగా.. వీరిద్దరూ కుటుంబ సభ్యులు, మత నాయకుడి సమక్షంలో ఆన్ లైన్ లో వివాహం చేసుకోవడం గమనార్హం.
అవును... ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలో ఓ ప్రత్యేక మైన సరిహద్దు వివాహం జరిగింది. ఇందులో భాగంగా... స్థానిక బీజేపీ నేత, కార్పొరేటర్ తహసీన్ షాహిద్.. తన పెద్ద కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్ ను, పాకిస్థాన్ లోని లాహోర్ నివాసి ఆడ్లీప్ జహ్రాతో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఆన్ లైన్ లో జరిగింది.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పలు పరిస్థితుల కారణంగా వరుడు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పొందలేకపోయాడు. మరోపక్క వదువు తల్లి రానా యాస్మిన్.. అనారోగ్యంతో పాకిస్థాన్ లోని ఓ హాస్పటల్ ఐసీయూలో ఉన్నారు. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో.. ఆన్ లైన్ పెళ్లి వేడుక ఆలోచన చేశాడంట షాహిద్.
ఈ మేరకు శుక్రవారం వీరి వివాహం జరిగింది! షియా మతనాయకుడు.. వివాహం విషయంలో స్త్రీ సమ్మతి చాలా అవసరమని, ఆమె దానిని మౌలానాకు తెలియజేస్తుందని వివరించారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించినప్పుడు ఆన్ లైన్ నికాహ్ సాధ్యమే అని అన్నారు!
ఈ సందర్భంగా స్పందించిన హైదర్... తన భార్యకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియన్ వీసా లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేష్ సింగ్ ప్రిషూ హాజరై వరుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు!