బీజేపీతో జట్టు టీడీపీకి ప్లస్ కానే కాదు...!?

ఏపీలో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల గోదావరిని ఈదాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది.

Update: 2024-02-09 03:42 GMT

ఏపీలో బీజేపీతో జట్టు కట్టి ఎన్నికల గోదావరిని ఈదాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. ఈ విషయంలో చాలా ఉత్సాహం కూడా కనిపిస్తోంది. బీజేపీ పెద్దలు పిలిచారో లేక తామే పిలిపించుకుని వెళ్లారో తెలియదు కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్ర నేత అమిత్ షాతో ఒక అర్ధరాత్రి ఏకంగా నలభై నిముషాల పాటు భేటీ వేశారు. హస్తిన వార్తలను బట్టి చూస్తే బీజేపీ బెట్టుగానే జట్టు కట్టేందుకు అంగీకరించింది అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ దాదాపుగా పన్నెండు దాకా ఎంపీ సీట్లను కోరుతోందని అంటున్నారు. అంటే సగం వాటా అన్న మాట. అలాగే పాతిక దాకా అసెంబ్లీ సీటు కూడా కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో ఆరు నుంచి ఎనిమిది దాకా ఎంపీ సీట్లు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు. అలాగే కనీసంగా పదిహేను ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లుగా అంటున్నారు.

ఇప్పటికే జనసేనకు పాతిక దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది అని వార్తలు వస్తున్నాయి. ఆ సంఖ్యను ఇంకా పెంచమని జనసేన కోరుతోంది అని అంటున్నారు. అలాగే మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు జనసేనకు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. అలా జనసేనకు బీజేపీకి అసెంబ్లీ సీట్లు నలభై నుంచి నలభై అయిదు, ఎంపీ సీట్లు ఒక డజన్ దాకా సమర్పించుకుంటే తెలుగుదేశం తమ్ముళ్లకు పోటీ చేసేందుకు ఏమి ఉంటుంది అన్నది పెద్ద ప్రశ్న.

ఇక ఏపీలో టీడీపీ జనసేన కూటమి విషయంలోనే గ్రౌండ్ లెవెల్ లో సర్దుబాట్లు సరిగ్గా లేవు అని వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీలలో ఆశావహులు ఉన్నారు. సీటు రాకపోతే రెబెల్స్ అవుతారు అని అంటున్నారు. టీడీపీ తమ్ముళ్ల సీట్లు జనసేనకు ఇస్తే వారు కూడా చూస్తూ ఊరుకోరు అంటున్నారు.

ఈ పరిస్థితులలో బీజేపీని తెచ్చి కూడా మీద పెడితే గత ఎన్నికల్లో కేవలం అర శాతం ఓటు షేర్ మాత్రమే వచ్చిన బీజేపీని గెలిపించడం మా వల్ల కాదు అని తమ్ముళ్ళు అంటారు అని ప్రచారం సాగుతోంది. బీజేపీకి సీట్లు ఇచ్చినా లేక జనసేనకు సీట్లు ఇచ్చినా టీడీపీ ఓటు అటు వైపు టర్న్ కాకపోతే ఆ సీట్లు అన్నీ చాలా ఈజీగా వైసీపీ ఖాతాలోకి పోతాయని కూడా అంటున్నారు.

పొత్తులు గట్టిగా ఉండాలి. పై లెవెల్ లో కుదుర్చుకోవడం కాదు, దిగువ స్థాయిలో మొదటి నుంచి అవగాహన ఉండాలి. ఎన్నికలు ముంగిట వచ్చిన వేళ ఒకరికి ఒకరు కౌగిలించుకుంటే ఓట్లు రాలవు. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుతోనే కావాల్సినంత గందరగోళం గ్రౌండ్ లెవెల్ లో ఉంది. దానికి తోడు బీజేపీని చేరదీస్తే ఇంకా ఎక్కువ అయి అసలుకే ఎసరు వచ్చేలా ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనంలో బీజేపీ పట్ల సానుకూలత ఏమీ లేదు. ఏపీకి సంబంధించి బీజేపీ చేసినది ఏమీ లేదని సగటు జనం భావన. హిందూత్వ సెంటిమెంట్ బీజేపీకి పాజిటివిటీ పెంచుతుంది అనుకుంటే ఆ ఊపు ఎక్కువగా ఉత్తరాదిన రాష్ట్రాలతో పాటు బీజేపీ బలంగా ఉన్న కర్నాటకలో కనిపిస్తుంది. ఏమైనా ఉంటే తెలంగాణాలో కొంత వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. ఏపీలో మాత్రం విభజన హామీల ముందు ఈ పాజిటివిటీ పెద్దగా నిలిచే చాన్స్ లేదు అని అంటున్నారు. మొత్తానికి ఈసారి పొత్తులు 2014 మాదిరిగా ఉండవు అని అంటున్నారు

అన్ని సార్లూ రెండు రెండు కలిస్తే నాలుగు కావని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ హిస్టరీ అయిన బాబుకు తెలియదా అంటే ఆయన ఆరాటంలో ఇవన్నీ మరచారా అన్నదే ప్రశ్న. ఏది ఏమైనా బీజేపీతో పొత్తు అంటే జగన్ నెత్తిన పాలు పోసినట్లే అన్న మాట కూడా ఉంది. ఇక బీజేపీ జగన్ ను కట్టడి చేయకపోతే ఎలక్షనీరింగ్ లోనూ ఇబ్బందులు వస్తాయి. బీజేపీ తీరు చూస్తే ఏపీలో జగన్ ని కూడా దూరం చేసుకునే అవకాశాలు లేవు అనే అంటున్నారు. సో ఈ పొత్తు దేనికి ఉపయోగం అంటే దానికి జవాబు ఎన్నికల ఫలితాలే చెప్పాలి.

Tags:    

Similar News