బాబుతో పవన్...బీజేపీ స్టెప్ అదేనా...?

ఏపీలో పొత్తుల కధను చంద్రబాబు అరెస్ట్ కొత్త మలుపు తిప్పింది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీ బీజేపీ జనసేన మూడున్నరేళ్లుగా పొత్తులో ఉన్నాయి.

Update: 2023-09-11 06:26 GMT

ఏపీలో పొత్తుల కధను చంద్రబాబు అరెస్ట్ కొత్త మలుపు తిప్పింది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఏపీ బీజేపీ జనసేన మూడున్నరేళ్లుగా పొత్తులో ఉన్నాయి. కానీ ఈ రెండు పార్టీలు కలసి ఒక్క కార్యక్రమం అయినా ఉమ్మడిగా నిర్వహించలేదు. పవన్ మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్ జనసేన తరఫున వెళ్ళి వచ్చారు.

ఆయన ఎండీయే భాగస్వామిగా ఉన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ తరువాత నుంచి పవన్ చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి పవన్ చంద్రబాబు అరెస్ట్ తరువాత పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని టాక్ నడుస్తోంది. కేవలం చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ ఆయనకు మద్దతు ప్రకటించడమే కాకుండా సడెన్ గా ఏపీకి కూడా పవన్ వచ్చారు.

ఆయన తన సొంత పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం కోసమే అని చెబుతున్నా చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో పవన్ మంగళగిరిలో ప్రత్యక్షం కావడం మాత్రం టీడీపీతో ఆయన సాన్నిహిత్యం మీదనే చర్చించేలా చేసింది. దానికి తోడు అన్నట్లుగా చంద్రబాబు రిమండ్ మీద టీడీపీ బంద్ కి పిలుపు ఇస్తే జనసేన సైతం బంద్ కి మద్దతు అని పవన్ ప్రకటించడంతో ఇపుడు జనసేన టీడీపీ పొత్తులు అఫీషియల్ అయ్యాయని అంటున్నారు.

ఇప్పటిదాకా జనసేంతో పొత్తు ఉండవచ్చు అని అంతా అనుకున్నారు. దానికి సీట్ల ఒప్పందాలు పేచీలూ చాలా ఉంటాయని కూడా భావించారు. పవన్ డిమాండ్ కూడా చేస్తారని అనుకున్నారు. కానీ ఎలాంటి బేరాలు పేచీలు లేకుండా చంద్రబాబుకు అపుడూ ఇపుడూ ఎపుడూ తన మద్దతు అని పవన్ ప్రకటించడం పట్ల పలు రకాలుగా చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయినది అవినీతి ఆరోపణల కేసులో.

పైగా ఆయన అరెస్ట్ మీద అయితే వైసీపీ చేయించింది అని భావించి ఆ పార్టీని నిందించవచ్చు. ఆందోళనలు చేయవచ్చు. కానీ బాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అంటే ప్రాధమిక ఆధారాలు అన్నీ చూసుకునే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అని అంతా భావించారు. అందుకే సీపీఎం కానీ బీజేపీ కానీ టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతు ఇవ్వలేదు.

అయినా కానీ పవన్ మద్దతు ఇస్తున్నారు అంటే ఆయన చాలా దూరం వెళ్లిపోయారా అన్న డౌట్లు అయితే బీజేపీ పెద్దలకు కలుగుతున్నాయని అంటున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా నిశితంగా చూస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చింది. ఇపుడు ఏపీ సీఐడీ విభాగం అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరిపిన సందర్భం ఉంది.

ఇలా బాబు కేసులో అవినీతి ఉందని భావించే బీజేపీ మౌనంగా ఉందని అంటున్నారు. ఇక కేంద్ర పెద్దలు అయితే ఆది నుంచి బాబు అరెస్ట్ మీద పట్టనట్లుగానే ఉన్నారు. మరి బీజేపీకి మిత్రుడుగా, ఎన్డీయే మెంబర్ గా భావిస్తున్న పవన్ పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి సొంతంగా నిర్ణయం తీసుకోవడం మీద కేంద్ర బీజేపీ పెద్దలు గుర్రు మీద ఉన్నారని అంటున్నారు.

ఇలా పవన్ సొంత నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీతో పొత్తును కొనసాగించడం పట్ల కూడా చర్చ సాగుతోంది. రేపటి రోజున ఒక వేళ బీజేపీ జనసేన కలసి పోటీ చేయాలని అనుకున్నా పవన్ కలసి వస్తారా అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది. అంటే ఏపీలో పోటీ చేస్తే టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేయాలని, లేకపోతే టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకుని ముందుకు పోతుందని కూడా చెప్పడానికేనా ఈ మద్దతు వ్యూహం అని కూడా బీజేపీలో చర్చ అయితే సాగుతోంది.

మొత్తానికి పవన్ ఇన్నాళ్ళూ ఎలా ఉన్నా ఇపుడు అయితే అఫీషియల్ గా టీడీపీ వెంట అని చెప్పేశారు అని అంటున్నారు. మరి బీజేపీ ఏమి చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర బీజేపీ పెద్దలు ఏపీలో రాజకీయాల పట్ల పొత్తుల పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక పవన్ ఎన్డీయేలో ఉంటూ టీడీపీకి మద్దతు ప్రకటించడం పట్ల కూడా బీజేపీ ఏమి ఆలోచిస్తుంది ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News