మ‌ళ్లీ మోడీనే.. బీజేపీ సిద్ధాంత రాహిత్యం?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఏర్పాటు చేసింది.

Update: 2024-02-17 17:30 GMT

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఏర్పాటు చేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో ఈ రోజు, రేపు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగాల‌నే అంశాల‌పై అగ్ర‌నాయ‌కులు చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌ధానంగా వ‌చ్చేఎన్నిక‌ల్లో 370 స్థానాల్లో ఒంట‌రిగానే విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న బీజేపీ.. ఆ దిశ‌గా ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేయాల‌నే విష‌యంపై విస్తృతంగా చ‌ర్చించ‌నుంది.

కాగా, ఈ జాతీయ స‌మావేశాల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా హాజ‌ర‌య్యారు. భార‌త మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న ప్ర‌ధాన మంత్రికి బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. ప్ర‌ధాన మంత్రి పార్టీ గుర్తింపు కార్డును తీసుకుని స‌మావేశ మందిరంలోకి ప్ర‌వేశించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రధానమంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

దేశం నలుమూలల నుంచి సుమారు 12 వందల మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న భారత మండపం వద్ద బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రంగులు చల్లుకుని, మిఠాయిలు తినుపించుకుని ఆనందం వ్యక్తం చేసుకున్నారు. కాగా.. ఈ సమావేశాల్లో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 400 పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న ల‌క్ష్యాన్ని ఏవిధంగా చేరుకోవాలన్న అంశంపై విస్తృతంగా చ‌ర్చించ‌నున్నారు.

అదేవిధంగా వ‌చ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని మరోసారి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించనున్నారు. పార్టీ ఎన్నికల ప్రచార సారధిగా కూడా ఆయ‌న‌నే ఎన్నుకోనున్నా రు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించ‌నున్నారు. ఈ మేర‌కు జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో తీర్మానం చేయనున్నారు. భారత మండపంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తెలుపుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

సిద్ధాంత రాహిత్యం?

బీజేపీ అంటేనే సిద్ధాంతం. తాను నిర్దేశించుకున్న సిద్ధాంతం మేర‌కే ఈ పార్టీ ప‌నిచేస్తుంది. దీని ప్ర‌కారం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్య‌క్తులు ఎవ‌రూ ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌ద‌వుల్లో ఉండేందుకు వీలు ఉండ‌దు. కానీ, ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో ఈ సిద్ధాంతాన్ని బీజేపీ ప‌క్క‌న పెట్టిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం 73 ఏళ్ల వ‌య‌సున్న ప్ర‌ధాని మోడీ మ‌రోసారి పీఎం అయితే.. ఆయ‌న‌కు 78 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఆ ప‌దవిలో ఉంటారు. మ‌ధ్య‌లో మార్చే అవ‌కాశంలేదు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కీల‌క నేత‌ల‌ను 70 ఏళ్ల వంక‌తోనే వారిని ప‌క్క‌న పెట్టిన బీజేపీ.. మోడీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News