'ఓ స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి నిలబెడితే జాతీయ అవార్డు'... సీతక్క ఫైర్!

సంధ్య థియేటర్ లో ఈ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-23 12:49 GMT

ఓ పక్క అటు కలెక్షన్స్ పరంగా సినిమా రంగంలో ‘పుష్ప-2’ సినిమా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటుండగా.. మరోపక్క ఈ సినిమా అటు రాజకీయ రంగంలోనూ కీలకాంశంగా మారిందని అంటున్నారు. సంధ్య థియేటర్ లో ఈ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఇక పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ సినిమాపై విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా చూశాక, ఇకపై సినిమాలు చూడొద్దని అనుకున్నట్లు ఒకరు చెబుతుండగా.. ప్రధానంగా 'జై భీమ్' సినిమాతో కంపేర్ చేస్తూ 'పుష్ప'ని మరొకరు కడిగిపారేస్తున్నారు. ‘పుష్ప’ లాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడాన్ని ఆక్షేపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో సీతక్క ఫైర్ అయ్యారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో తీవ్ర పరిస్థితుల్లో ఉండటం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుబడుతూ ప్రభుత్వ పెద్దలు విరుచుకుపడుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... "పుష్ప-2" సినిమాలో హీరో ఒక ఎర్రచందనం స్మగ్లర్ అని.. అలాంటి సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం దేనికి సంకేతం అని సీతక్క ప్రశ్నించారు. ఆ సినిమాలో స్మగ్లర్ గా చేసిన వ్యక్తిని హీరో చేశారని.. పోలీసులను విలన్ చేశారని పేర్కొన్నారు. ఒక స్మగ్లర్ పోలీసుల బట్టలు విప్పించి నిలబెడితే జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

ఇటువంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రలో రెండు హత్యలు చేసిన నిందితుడు "పుష్ప-2" సినిమా చూస్తూ దొరికాడని.. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా ఉన్నాయంటూ సీతక్క వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో.. సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా తీసిన "జై భీమ్" వంటి సినిమాలకు అవార్డులు రాలేదని ఆమె ఘాటుగా స్పందించారు. ఓ మామూలు మహిళ భర్తను దొంగతనం కేసు పెట్టి, ఉన్నత వర్గాల వారు ఇబంది పెడుతుంటే.. చేతిలో బిడ్డ, కడుపులో రూపం పోసుకుంటున్న బిడ్డతో ఆమె చేసిన పోరాటాన్ని అద్భుతంగా తీసుకొచ్చారని తెలిపారు.

ఈ సందర్భంగా మాకు ఇన్ని హక్కులు ఉంటాయా అని చాలా మందికి "జై భీమ్" సినిమా ఎంతో ప్రేరణగా నిలిచిందని అన్నారు. కానీ.. అలాంటి సినిమాలను ప్రోత్సహించలేదని.. అలాంటి సినిమాలకు అవార్డులు రాలేదని మండిపడ్డారు.

Tags:    

Similar News