రంగంలోకి అల్లు అర్జున్ మామ... టీ.కాంగ్రెస్ నుంచి భరోసా దక్కినట్లేనా?
‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే
‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పెద్దలను కలవడానికి ప్రయత్నిస్తే.. అందుకు వారు సమయం ఇవ్వలేదని తెలుస్తోంది!
అవును... సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని అంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ కు కాంగ్రెస్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో.. అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు.
ఇలా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ - అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ నెట్టింట జరుగుతున్న నేపథ్యంలో.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు రావడం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఆయన తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు గాంధీ భవన్ కి వచ్చారని తెలుస్తోంది.
ఈ సమయంలో మున్షీతో భేటీ అయ్యేందుకు చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ లోని ఆమె ఆఫీసుకు వెళ్లారు! అయితే.. ఆమెకు అప్పటికే ముందస్తు కార్యక్రమాలు షెడ్యూల్ అయ్యి ఉండటంతో చంద్రశేఖర్ రెడ్డికి సమయం ఇవ్వలేకపోయారని అంటున్నారు. దీంతో.. ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అయితే... కాంగ్రెస్ నేత అయిన చంద్రశేఖర్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కలవకపోవడంపై చర్చ మొదలైందని అంటున్నారు. మరోపక్క.. నిజంగానే శేఖర్ రెడ్డి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే మున్షీని కలవడానికి వచ్చారా.. లేక, ఆమె కావాలనే సమయం ఇవ్వలేదా..? అనే చర్చలు నెట్టింట మొదలయ్యాయని అంటున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!:
ఇలా దీపాదాస్ మున్షీని కలవకుండానే చంద్రశేఖర్ రెడ్డి తిరిగి వెళ్లిపోవడంపై... అల్లు అర్జున్ మామకు కాంగ్రెస్ పార్టీకీ మధ్య దూరం పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్న వేళ.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... అల్లు అర్జున్ మమ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అని.. ఆయన తనకు మంచి స్నేహితుడని.. ఆయన వచ్చినప్పుడు తాను మీడియా సమావేశంలో ఉన్నానని.. దీపాదాస్ మున్షీని ఆయన కలిశారని.. అయితే ఆమెతో చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లిపోయారని తెలిపారు.
అయితే.. అనంతరం చంద్రశేఖర్ రెడ్డికి తాను ఫోన్ చేసి మాట్లాడానని.. ఒకటి రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడుకుందామని చెప్పానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దీంతో.. అల్లు అర్జున్ మామకు కాంగ్రెస్ నుంచి కాస్త భరోసా దక్కినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!