శ్రీతేజ్ కు అండగా 'పుష్ప-2' నిర్మాత... ఇండస్ట్రీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-23 12:14 GMT

సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో.. పుష్ప-2 సినిమా నిర్మాతతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి, సుమారు 17 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను 'పుష్ప-2' నిర్మాత నవీన్ తో కలిసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబానికి నిర్మాత ఆర్ధిక సహాయం చేశారు.

ఇందులో భాగంగా.. పుష్ప-2 నిర్మాత నవీన్... 50 లక్షల రూపాయల చెక్కును మృతురాలి భర్త, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టమని అన్నారు. అనంతరం మంత్రితో కలిసి భాస్కర్ కు రూ. 50 లక్షల చెక్ ను అందజేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ ను వదిలిపోతుందంటూ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అమెరికా తర్వాత ఐటీ రంగానికి హైదరాబాద్ సెకండ్ ఆప్షన్ గా మారుతున్న దశలో మనం ఉన్నామని.. హైదరబాద్ ను వదిలి ఇండస్ట్రీ ఎక్కడికీ వెళ్లదని తెలిపారు.

ఇదే సమయంలో... మీడియా మిత్రులు కూడా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకోండని తెలిపారు. ఇదే సమయంలో.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవడానికి దేశ విదేశాల్లో ఎక్కడి నుంచైనా సరే మందులు తెప్పించాలని ఇప్పటికే వైద్యులకు సూచించినట్లు తెలిపారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని అన్నారు.

ఇదే సమయంలో... అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ జరిపిన దాడిని ప్రస్థావించిన కోమటిరెడ్డి.. ఇలాంటి పనులు ఎవరు చేసినా చట్టం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని.. ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసులు, చట్టం ఉన్నాయని.. వారి పని వారు చేస్తారని తెలిపారు. ఇండస్ట్రీకి తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ ని, సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నట్లు బీఆరెస్స్, బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని.. అలాంటి మాటలు మాట్లాడటం తప్పని అన్నారు. ఈ విషయాన్ని ఇంకా రాజకీయం చేయొద్దని కోరారు. ఇదే సమయంలో... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించాలని.. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News